నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ చుట్టుపక్కల నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలకు సిద్ధమయ్యారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం ఈ ఆరోదఫా చర్చలు జరగనున్నాయి. కేంద్రం తరపున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. చర్చలకు అంగీకారం తెలుపుతూ రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశాయి.
వీటిపైనే చర్చ!
వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలు సమావేశం ఎజెండాలో ఉండాల్సిందే అని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. రాజధాని ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో పంట వ్యర్ధాలను కాల్చే రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా.. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆర్డినెన్స్‌లో సవరణల అంశాన్ని కూడా చర్చించాలని తేల్చిచెప్పాయి. 2020-విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లులో చేయాల్సిన మార్పుల అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా వీటిని పునరుద్ఘాటించాయి.