రైతు ఉద్యమం ఉన్నట్టుండి రూపుమార్చుకొంది. తొలుత.. పంజాబ్, హరియాణా అన్నదాతల ఆందోళనగా ముద్రపడిన నిరసనలు ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌కూ బలంగా విస్తరించాయి. ఉద్యమ నేత రాకేశ్ టికాయిత్ కన్నీళ్లు పెట్టుకోవడం పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలతోపాటు, జాట్ సామాజిక వర్గాన్ని కలచి వేసింది. హరియాణాలోని జాట్‌లు కూడా టికాయిత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతు ఉద్యమ కేంద్రంగా ఉన్న సింఘూ నుంచి చిత్రం గాజీపుర్‌కు మారిపోయింది. నిన్నమొన్నటివరకు ఈ సభాస్థలిలో 80 శాతం మంది పంజాబీ, హరియాణా రైతులు, 20 శాతం మంది యూపీ రైతులు ఉండగా ఇప్పుడు 80 శాతం మంది ఉత్తర్‌ప్రదేశ్ వారే కనిపిస్తున్నారు. జాట్ల ప్రాబల్యం అధికంగా పశ్చిమ యూపీ అంతటా ఉద్యమ వేడి వ్యాపించింది. ఈ పరిణామం భాజపాకు సెగలా మారింది. జాట్ వర్గానికి చెందిన ఆర్‌ఎల్‌డీని ఓడించి భాజపాకు మద్దతుగా నిలిస్తే అధికారపార్టీ తమనే అణచివేయడానికి ప్రయత్నిస్తోందన్న భావన ఇప్పుడు ఆ వర్గంలో ప్రబలింది.
కమలంలో వణుకు
ఉత్తర్‌ప్రదేశ్ గ్రామాల నుంచి ప్రస్తుతం ఉద్యమానికి యువత దండిగా తరలివస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో ఈ పరిణామం భాజపా నాయకులకు వణుకు పుట్టిస్తోంది. చాలామంది అంతర్గతంగా దీనిపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రైతులు ఆందోళన చేసినా అక్కడ భాజపా రాజకీయ ప్రాబల్యం లేకపోవడంవల్ల పెద్దగా నష్టం ఉండదన్న ఉద్దేశంతో స్పందించలేదని, ఇప్పుడు కేంద్రంలో అధికారానికి మూలాధారమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పునాదులు కదిలే పరిస్థితి వచ్చింది కాబట్టి మోదీ ప్రభుత్వం స్పందించక తప్పదని పేర్కొంటున్నారు. ఈ నెల 26న జరిగిన నాటి ఘటనల అనంతరం.. రైతు నేతలందరిపై కఠినమైన చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం.. ఉన్నట్టుండి చర్చల ప్రస్తావన చేయడానికి కారణం జాట్‌ల నుంచి ఎదురయ్యే నష్టాన్ని నివారించుకొనే ఎత్తుగడేనంటున్నారు.
జాట్‌ల మద్దతుతో గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ యూపీలో దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్న భాజపాకు ప్రస్తుత పరిస్థితులు పంటి కింద రాయిలా తయారైనట్లు చెప్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉద్యమం రాజుకుంటే అది ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ప్రబలే ప్రమాదం ఉందన్న భయం అధికార పక్షంలో ఉంది. అజిత్‌సింగ్‌ను ఓడించి తాము చాలా పెద్దతప్పు చేశామని ముజఫర్‌నగర్‌లో జరిగిన మహా పంచాయత్‌లో జాట్ నేత నరేశ్ టికాయిత్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు భాజపాలో గుబులు రేపుతోంది.
ఇదీ చదవండి:100 మందికిపైగా పంజాబ్ రైతుల అదృశ్యం