తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుస్థిర లక్ష్యాలకు దూరంగా భారత్!​ - సుస్థిర లక్ష్యాలకు దూరంగా-భారత్​

ఇండియా ధనిక దేశమేగాని భారతీయులే నిరుపేదలు’ అన్నది దశాబ్దాలుగా వాడుకలో ఉన్న నానుడి. పేదరికాన్ని దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని పరిమార్చి పౌరులందరి గౌరవప్రద జీవనానికి భరోసా ఇస్తామన్న తొలినాటి నేతల ప్రతిజ్ఞలతోనే స్వతంత్ర భారతావని ఏరువాక మొదలైంది. ఏడు దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో పేదరికం పూర్తిగా సమసిపోయిందా? ఆకలి అనారోగ్యాలు పీడ వదిలి పౌష్టికాహార సమస్యల్లేని శ్రేష్ఠ భారత్‌ స్వప్నం సాకారమైందా?- అన్న ప్రశ్నలకు లేదు లేదనే నీతిఆయోగ్‌ సమాధానమిస్తోంది.  అవేంటో తెలుసుకుందాం.

edirotial
సుస్థిర లక్ష్యాలకు దూరంగా-భారత్!​

By

Published : Jan 9, 2020, 7:28 AM IST

2030నాటికి మొత్తం 193 దేశాలూ నిష్ఠగా సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని ఐక్యరాజ్య సమితి గుదిగుచ్చి నాలుగేళ్లు దాటింది. ఆ లక్ష్యాలు ఏ దశలోనూ అలక్ష్యం కాకుండా ఎకాయెకి వంద సూచీల ద్వారా రాష్ట్రాల ప్రగతిశీలతను పరిశీలిస్తున్న నీతి ఆయోగ్‌- పేదరిక నిర్మూలన పద్దులో 14 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల వెనకబాటును సూటిగా వేలెత్తి చూపింది. నూటికి యాభై పాయింట్లు కూడా సాధించలేకపోయిన రాష్ట్రాల్లో బిహార్‌ మధ్యప్రదేశ్‌ రాజస్థాన్‌ యూపీ(బిమారు)లతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, పంజాబ్‌, హరియాణా వంటివీ కొలువుతీరడం దిగ్భ్రాంతపరుస్తోంది. అన్నార్తుల ఆక్రందనలకు తావులేకుండా చూడాలన్న మరో సమున్నత లక్ష్యసాధనలో ఎకాయెకి 20 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు యాభై శాతం స్కోరూ అందుకోలేకపోయాయి.

జాతీయ పౌష్టికాహార అధ్యయనం దేశవ్యాప్తంగా అయిదేళ్లలోపు పిల్లల్లో మూడోవంతుకు (34.7 శాతం) పైగా వయసుకుతగ్గ ఎత్తులేక గిడసబారిపోయినట్లు వెల్లడించింది. అధికాదాయ దేశాల్లో ఆ తరహా పిల్లలు రెండున్నర శాతంగానే ఉన్నారంటూ 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ పౌష్టికాహార లేమి దుష్ప్రభావాన్ని ఆ స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. గోవా కేరళ తమిళనాడు వంటివి ఈ విషయంలో ఎన్నదగిన ప్రగతి సాధిస్తుండగా బిహార్‌ ఈసురోమంటోంది. నిన్నామొన్నటి దాకా రాష్ట్రాల స్థూల ఆర్థిక ప్రగతి రేట్లు కళ్లు మిరుమిట్లుగొలిపేలా నమోదైన చోట్లా సామాజిక స్వస్థత, పేదరికం స్థాయులు దిగనాసిగా ఉండటం- అట్టడుగు స్థాయిదాకా అభివృద్ధి ఫలాలు చేరని దురవస్థకే దర్పణం పడుతోంది!

పేదరికానికి చిహ్నాలు

కేవలం డబ్బు లేకపోవడమే బీదరికానికి కొలమానం కాదంటూ- అనారోగ్యం, పౌష్టికాహారం పొందలేకపోవడం, మంచినీరు, విద్యుత్‌, నాణ్యమైన పని, విద్య అందుబాటులో లేకపోవడమూ బహుముఖ పేదరిక చిహ్నాలుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2005లో అలాంటి పేదలు ఇండియా వ్యాప్తంగా 64 కోట్ల మంది ఉన్నారని, 2016 నాటికి వారి సంఖ్య దాదాపు 37 కోట్లకు దిగివచ్చిందనీ నిరుడు జులైనాటి నివేదిక వెల్లడించింది. ‘దారిద్య్ర రేఖ’కు నిర్దుష్ట కొలమానాల్ని నేటికీ నిర్ధారించలేకపోయిన ఇండియాలో వాస్తవంగా నిరుపేదలు ఎంతమంది అన్నది ప్రణాళికాకర్తలెవ్వరికీ తెలియని దుస్థితి పోగుబడి ఉంది. ఆకలి, పౌష్టికాహార లోపం, అయిదేళ్లలోపు పిల్లల్లో తక్కువ బరువు, ఎదుగుదల లోపాలు, మరణాల రేటు వంటి అంశాల ప్రాతిపదికన వెలువడే ప్రపంచ క్షుద్బాధ సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌) 117 దేశాల్లో ఇండియాకు 102వ స్థానం కట్టబెట్టింది.

ఎత్తుకు తగ్గ బరువులేని 21 శాతానికి పైగా పిల్లలతో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవంక పేదరికం తగ్గుతోందన్న గణాంకాలు వీనుల విందుగా ఉన్నా- స్వాతంత్య్రం వచ్చినప్పటి మొత్తం జనాభా కంటే అధికంగా నేటికీ భారత్‌లో బీదలున్నారన్న లెక్కలు- పన్నెండు పంచవర్ష ప్రణాళికల ఔచిత్యాన్నే బోనెక్కిస్తున్నాయి. 2000 సంవత్సరంలో క్షుద్బాధ సూచీలో 83వ స్థానంలో ఉన్న ఇండియా తాజాగా 19 స్థానాలు దిగజారడం ఏ అభివృద్ధికి కొలమానమో అర్థం కాదు. పొరుగున నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే ఆకలి కేకల కట్టడిలో తీసికట్టుగా ఉన్న ఇండియాలో- విధానాల పరివర్తన, పథకాల సక్రమ అమలుపై దృష్టి సారించనిదే సుస్థిరాభివృద్ధి సాధ్యం కాబోదు!

పెనుశాపం

పుట్టిన తొలి వెయ్యిరోజుల్లోనే మనిషి మెదడు 90 శాతం ఎదుగుతుందంటున్న శాస్త్రవేత్తలు, పౌష్టికాహార లోపం దాపురిస్తే శారీరక మానసిక వికాసం మందగించి మునుముందు పిల్లలు సమర్థ మానవ వనరులుగా అక్కరకొచ్చే అవకాశమే ఉండదని నిగ్గుదేల్చారు. నిశ్శబ్ద హంతకిగా పేదరికం తరతరాల ప్రగతికి ఉరితాళ్లు బిగించినా పోచికోలు పథకాల వల్లెవేతకే ఏడు దశాబ్దాలుగా పరిమితమైన అధికార గణాల పాపం దేశాభివృద్ధికి పెనుశాపంగా మారిందనడంలో సందేహం లేదు. మధ్యాహ్న భోజన పథకం కింద యూపీలోని ఒక పాఠశాలలో లీటరు పాలను 80మంది పిల్లలకు పంచిన వైపరీత్యం- సంక్షేమం పద్దు కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న వేలకోట్ల రూపాయల ప్రజాధనం ఎలా గాలికిపోయే పేలపిండిగా మారిందో ప్రస్ఫుటీకరిస్తోంది.
2030 నాటికి 17 సుస్థిరాభివృద్ధి ఆశయాలను, వాటికి సంబంధించిన 169 లక్ష్యాల సాధన ద్వారా నెరవేర్చాలన్న సమితి- పేదరికం, ఆకలి మలిగిపోవాలన్న వాటికే అగ్రప్రాధాన్యం ఇచ్చింది. మంచి ఆరోగ్యం,

నాణ్యమైన విద్యలను సుస్థిరాభివృద్ధి సాధకాలుగా గుర్తించింది. సమితి ఆశయాలు నెరవేర్చేలా 15 కేంద్ర పథకాలు అమలులో ఉన్నాయని నీతిఆయోగ్‌ చెబుతున్నా, ఆరోగ్య రంగానికి సంబంధించిన వ్యూహపత్రంలో బడ్జెట్‌ అవసరాలు, నిధుల లభ్యత ప్రస్తావనలే లేవని ‘కాగ్‌’ ఇటీవల ఆక్షేపించింది. పేదరికం కాదు, ఆర్థిక అసమానతలే ఇండియా ప్రగతికి గుదిబండ కానున్నాయన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో పెరిగిన జాతి సంపదలో 73 శాతం- జనాభాలో ఒక్క శాతంగా ఉన్న కుబేరుల చెంతకే చేరిందని, 67 కోట్లమంది భారతీయుల సంపదలో పెరుగుదల ఒక్క శాతంగా ఉందని ‘ఆక్సోఫామ్‌’ నివేదిక ఎలుగెత్తింది. స్వాతంత్య్ర లక్ష్యాలు, రాజ్యాంగ ఆశయాలు, సంక్షేమరాజ్య ఆకాంక్షలు నెరవేరి ఇండియా సుస్థిరాభివృద్ధి సాధించాలంటే- విధానాల కూర్పులోనే సమూల మార్పు రావాలి!

ఇదీ చూడండి : చలిపులి నుంచి కాపాడే బాబా రామ్​దేవ్ సూత్రాలు!

ABOUT THE AUTHOR

...view details