మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం.. గుజరాత్ వడోదర నుంచి మండ్లేశ్వర్కు వెళ్లి పవిత్ర నర్మదా నదిలో పూజలు నిర్వహించింది. ఇందుకోసం వారు 400 కిలోమీటర్లు కాలినడక సాగించడం విశేషం. కరోనా సంక్షోభం నుంచి నర్మదా నదే ప్రజలను కాపాడుతుందని వారు విశ్వసిస్తున్నారు.
'నర్మద తల్లి రక్షిస్తుంది..'
మధ్యప్రదేశ్ రేవాకు చెందిన అవ్నీశ్ ఓ జ్యోతిషుడు. 13ఏళ్ల వయస్సులోనే రేవాను విడిచి వడోదర చేరుకున్నారు. అక్కడే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇటీవలే అవ్నీశ్.. తన భార్య, ఐదేళ్ల బాలిక, రెండున్నరేళ్ల బాలుడితో కలిసి వడోదర నుంచి మండ్లేశ్వర్కు 400 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేశారు. నర్మదా నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచారించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రపంచాన్ని మింగేస్తున్న కరోనా సంక్షోభం నుంచి మానవాళిని బయటపడేసేది నర్మద తల్లేనని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు అవ్నీశ్. ఈ సందర్భంగా తమకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.
"శ్లోక్(కొడుకు) పుట్టబోయే సందర్భంగా.. రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు వెళ్లాము. 40రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించాము. తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత నా భార్యకు విపరీతమైన నొప్పులు మొదలయ్యాయి. వైద్యులను సంప్రదించిన తర్వాత.. నా భార్య కడుపులో కవలలు ఉన్నారని తేలింది. కానీ అందులో ఒకరు మరణించారని వైద్యులు తెలిపారు. తల్లీ-బిడ్డను రక్షించడం తమ వల్ల కాదని వైద్యులు చేతులెత్తేశారు. కానీ ఆ నర్మద తల్లే నా భర్యను, బిడ్డను కాపాడింది."
-- అవ్నీస్, జ్యోతిషుడు.
నర్మదకు పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి బయలుదేరింది అవ్నీశ్ కుటుంబం.
ఇదీ చూడండి:ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకువెళ్లిన కారు-వీడియో వైరల్