రామమందిర శంకుస్థాపనకు అయోధ్య అన్ని హంగులతో సిద్ధమవుతోంది. కోట్లాది మంది హిందువుల కలలను నిజం చేసే పవిత్రకార్యానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపనకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆలయం నిర్మాణం గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిని సైతం గుర్తు చేసుకుంటున్నారు. ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్, రామచంద్ర దాస్ లాంటి ఎందరో నాయకుల 70 ఏళ్ల పోరాటం ఫలితంగానే సుప్రీంకోర్టు రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తూ 2019, నవంబర్ 9న తుది తీర్పును వెలువరించింది. దీంతో ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు.
గోపాల్ సింగ్తో ఆరంభం..
అయోధ్యలో రామపూజకు మొదట గళమెత్తిన భక్తుడు గోపాల్ సింగ్ విశారద్. రామ జన్మభూమి వద్ద కొలువుదీరిన రాముడి, సీత విగ్రాహాలను ఆరాధించే హక్కులను కోరుతూ అయన 1950లో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం ఆయనే విగ్రహాలకు పూజలు చేసుకునే హక్కును కల్పించాలని దిగువ కోర్టులో మరో పిల్ దాఖలు చేశారు. 1986 లో గోపాల్ సింగ్ మరణించగా.. ఆ బాధ్యతను ఆయన కుమారుడు రాజేంద్ర సింగ్ తీసుకున్నారు.
- రామజన్మ భూమిని స్వాధీనం చేసుకోవాలని, రాముడు జన్మించిన ఈ ప్రాంతానికి సంరక్షకులు తామేనని నిర్మోహి అఖాడా అనే సంస్థ 1959లో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనితో కలిపి అప్పటి వరకు మూడు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నిర్మోహి అఖాడా నాయకుడు మహంత్ భాస్కర్ దాస్ ఈ న్యాయ పోరాటానికి నాయకత్వం వహించారు. ఆయన చాలా ఏళ్లు న్యాయ పోరాటం చేశారు.
విశ్వహిందూ పరిషత్ రాక..
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ 1984 లో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. దానికి అప్పటి వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ నాయకత్వం వహించారు.
- అయోధ్య ఉద్యమంలో మహంత్ అవిద్యనాథ్ కూడా ముఖ్య భూమిక పోషించారు. శ్రీ రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితిని స్థాపించి ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు.
- భజరంగ్ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భాజపా నాయకుడు వినయ్ కటియార్ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు.
- 1989లో వీహెచ్‌పీ సభ్యులు అయోధ్యలో శిలన్యాస్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ రాయిని ప్రతిష్ఠించారు.