ఫేస్‌బుక్ ఎప్పటికీ తటస్థ వేదిక అని.. పక్షపాతరహితంగా వ్యవహరిస్తుందని ఆ సంస్థ భారత విభాగం అధిపతి అజిత్ మోహన్ అన్నారు. ఫేస్‌బుక్ ఎవరివల్లా ప్రభావితం కాలేదని.. ఈ వ్యవహారాల్లో ఏ ఒక్కరూ జోక్యం చేసుకునేందుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ ఇండియాను.. భాజపా నేతలు ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సామాజిక మాధ్యమ వేదిక పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఉద్ఘాటించారు.
అధికార భాజపా నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా.. దేశంలో తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకొనేందుకు ఫేస్‌బుక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్'లో ఓ కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలోనే స్పందించారు అజిత్ మోహన్.
కంటెంట్ నిర్వహణలో ఫేస్‌బుక్ నిష్పాక్షిక విధానాలను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, సాంస్కృతిక, మత విశ్వాసాలకు అతీతంగా పనిచేసే వ్యవస్థ.. అమల్లో ఉందని వెల్లడించారు ఫేస్‌బుక్ భారత విభాగం ఎండీ అజిత్ మోహన్.