కరోనాతో నెలకొన్న కష్ట కాలంలో ఎక్కడ చూసినా జనం మాస్క్‌లతోనే కనబడుతున్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఈ మహమ్మారితో కలిసి బతకాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతిఒక్కరి జీవితంలో మాస్క్ కూడా భాగమైంది.
నిత్యావసరంగా మారిన ఈ రక్షణ తొడుగులకు గిరాకీ ఏర్పడటం వల్ల రోజుకో కొత్త కొత్త వెరైటీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే, మాస్క్‌లు పెట్టుకున్నవారి ముక్కు, నోరు, గడ్డం మూసి ఉండట వల్ల వారిని గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఈ 'గుర్తింపు' సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న కేరళకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్.. వినూత్నంగా ఓ మాస్క్‌ను రూపొందించి తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కొట్టాయంలో ఏటుమానూరుకు చెందిన 38 ఏళ్ల బినేశ్ జి పాల్ రూపొందించిన ఈ మాస్క్‌ను ఎవరైనా పెట్టుకుంటే.. అవతలి వాళ్లు వెంటనే గుర్తు పట్టగలరు.
20 నిమిషాల్లోనే మాస్క్ రెడీ..
దాదాపు 10 ఏళ్లుగా ఫొటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న బినేశ్.. ఈ మాస్క్ తయారీ గురించి వివరించాడు.
"ఎవరికైతే మాస్క్ తయారు చేస్తున్నామో వారికి హై రిజల్యూషన్ కెమెరాతో ఫొటో తీసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్రత్యేక కాగితంపై దాన్ని ప్రింట్ తీయాలి. అనంతరం ఆ ఫొటోను పెద్ద పరిమాణంలో తీసుకొని మాస్క్‌పై సూపర్‌ఇంపోజ్ విధానం ద్వారా అతికించాలి. ఆ సమయంలోనే గడ్డం కొలతను సరిచూసుకుంటాం" అని వివరించారు. అయితే ఫొటోను మాస్క్‌పై అతికించే విధానానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఒక్కో మాస్క్‌ను రూ.60లకు విక్రయిస్తున్నట్టు బినేశ్ వెల్లడించారు.