రైల్వే ఆస్తులు పరిరక్షించడం సహా ప్రయాణికుల భద్రత కోసం నింజా డ్రోన్లను రైల్వే శాఖ కొనుగోలు చేసినట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ముంబయి కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే ఇటీవలే రెండు నింజా యూఏవీలను కొన్నట్లు చెప్పారు. భద్రతను మరింత పెంచడంతో పాటు స్టేషన్ పరిసరాల్లో నిఘాను పెంచేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
"నిఘా వ్యవస్థను మెరుగుపర్చేందుకు నింజా యూఏవీలను ఇటీవలే రైల్వే శాఖ కొనుగోలు చేసింది. రియల్ టైం ట్రాకింగ్, వీడియో స్ట్రీమింగ్, ఆటోమెటిక్ ఫెయిల్ సేఫ్ మోడ్ వంటి ఫీచర్లతో రైల్వే ఆస్తులపై పర్యవేక్షణ పెంచేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయి. ప్రయాణికులకు అదనపు భద్రత కల్పించేందుకు వీలు కల్పిస్తాయి."
-పీయూష్ గోయెల్, రైల్వే శాఖ మంత్రి
భద్రత కోసం రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) విస్తృతమైన ప్రణాళికలు రచించిందని రైల్వే శాఖ తెలిపింది. రూ.31.87 లక్షలతో 9 నింజా డ్రోన్లను ఆర్పీఎఫ్ కొనుగోలు చేసిందని వెల్లడించింది. తూర్పు రైల్వే, మధ్య రైల్వే, నైరుతి రైల్వే సహా రాయ్‌బరేలీలోని మోడర్న్ కోచింగ్ ఫ్యాక్టరీ కోసం వీటిని కొన్నట్లు పేర్కొంది.
రూ.97.52 లక్షలతో మరో 17 డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించినట్లు రైల్వే తెలిపింది. వీటిని ఆపరేట్ చేసేందుకు 19 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇందులో నలుగురికి డ్రోన్లు ఎగురవేయడానికి అవసరమయ్యే లైసెన్సులు అందినట్లు స్పష్టం చేసింది.