తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనతా కర్ఫ్యూ అంటే? దాని అవసరం ఏంటి? - Janatha corfew doubts

దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఈ కారణంగా 'జనతా కర్ఫ్యూ'నకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రధాని పిలుపుమేరకు యావద్దేశం స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూపై సామాన్య ప్రజానీకంలో నెలకొన్న అనుమానాల నివృతిపై ప్రత్యేక కథనం మీకోసం...

Janatha curfew
జనతా కర్ఫ్యూపై సందేహాలు

By

Published : Mar 22, 2020, 5:37 AM IST

Updated : Mar 22, 2020, 10:26 AM IST

కరోనా నియంత్రణకై భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు యావద్దేశం జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. భారత ప్రజానీకమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ఇళ్లకే పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? దీనిద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది.? అనే అంశాలపై ప్రత్యేక వివరణ.

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి?

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడమే జనతా కర్ఫ్యూ. కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు యావద్దేశం పాటిస్తోంది. అత్యవసరమైతే తప్ప.. ఇళ్లనుంచి బయటకు కదలకూడదని మోదీ దేశ ప్రజలకు సూచించారు.

కర్ఫ్యూ లక్ష్యమేంటి?

సామాజిక దూరం పాటించడమే జనతా కర్ఫ్యూ లక్ష్యం. దీని ద్వారా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉంటుంది. కరోనా వైరస్ ఎంత తీవ్రమైనదనే అంశంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది.

ప్రజలు పాటించాల్సిన అంశాలు?

ఉదయం నుంచి రాత్రి వరకు బయటకు రాకూడదు. అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదు. వీధి అమ్మకాలు మొదలుకొని వాణిజ్య కార్యకలాపాలు నిలిపేయాలి. ప్రజలు.. బంధుమిత్రులను కలవడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలను నిలిపేయాలి.

చప్పట్లు ఎందుకు?

బాధితుడితో వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలగడం, అతడు ఉపయోగించిన వస్తువులను తాకడం ద్వారా కరోనా సోకుతుంది. ఈ నేపథ్యంలో తమకు వైరస్ సోకే అవకాశాలున్నప్పటికీ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా రంగ ప్రతినిధులు, పోలీసులు, డ్రైవర్లు, రైల్వే, బస్సు, ఆటోరిక్షా కార్మికులు, డెలివరీ బాయ్స్ వీరందరూ దేశ ప్రజలకోసం శ్రమిస్తున్నారు. వీరందరి కృషికి కృతజ్ఞతగా సాయంత్రం 5 గంటలకు.. 5 నిమిషాలపాటు దేశ ప్రజలు చప్పట్లు కొట్టాలి. గంటలు మోగించాలి.

కర్ఫ్యూతో వైరస్​ పోతుందా?

జనతా కర్ఫ్యూ అనంతరం వైరస్​ పూర్తిగా అంతమవుతుందని కాదు. కర్ఫ్యూ ముగిసిన అనంతరమూ ప్రమాదం కొనసాగుతూనే ఉంటుంది. వైరస్ నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను నిజ జీవితంలో అమలు చేయాలి. జ్వరం, జలుబు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటే మాస్కులు ధరిస్తూ.. ఇతరులను కలవడాన్ని నియంత్రించాలి. వైద్యులను సంప్రదించాలి.

ఇదీ చదవండి:జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి: రాజ్​నాథ్​

Last Updated : Mar 22, 2020, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details