తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏమిటీ టేబుల్‌టాప్‌ రన్‌వే? అవి ఎక్కడున్నాయి?

కోజికోడ్‌ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకున్న విషాదాన్ని గుర్తుకుతెచ్చింది. 2010లో మంగళూరులో జరిగిన ఘటన లాగే.. ఇక్కడ జరిగిన ప్రమాదం కూడా టేబుల్‌టాప్‌ రన్‌వేపైనే సంభవించడం గమనార్హం. దీనితో టేబుల్‌టాప్‌ రన్‌వేలు అంటే ఏమిటో.. దేశంలో అవి ఎక్కడున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

TABLETOP RUNWAY AIRPORTS
ఏమిటీ టేబుల్‌టాప్‌ రన్‌వే? ఎక్కడున్నాయి?

By

Published : Aug 8, 2020, 2:15 PM IST

టేబుల్‌ టాప్‌ రన్‌వే.. పేరుకు తగినట్టుగానే టేబుల్‌ ఉపరితలం మాదిరిగానే ఉంటుంది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండేచోట ఈ తరహా రన్‌వేలు ఏర్పాటు చేస్తారు.అందువల్ల ఈ రన్‌వేలకు ముందు, వెనుకా కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లో ఉండే రన్‌వేలతో పోలిస్తే వీటి నిడివి కూడా చాలా చిన్నది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా ఇక్కడ విమానాలను ల్యాండ్‌ చేయడం పెద్ద సవాలే. పైలట్లు వెంట్రుకవాసి తప్పిదం చేసినా విమానానికి ఘోర ప్రమాదం తప్పదు.

అందుకే విమానాశ్రయం రన్‌వేకు రెండు చివరలలో కొంత స్థలం ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కోజికోడ్‌లో అలా అదనంగా స్థలం లేదని చెబుతున్నారు. పరిమితమైన భూభాగం ఉండటం వల్ల విమానం ల్యాండింగ్‌ సమయంలో ఎంతో అప్రమత్తత అవసరం. టేబుల్‌ టాప్‌ రన్‌వేలకు ఎయిర్‌ఫీల్డ్‌ చుట్టూ రోడ్ల సమస్య కూడా ఉంది. విమాన ప్రమాదం సమయంలో వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇరుకైన రహదారుల కారణంగా సహాయక చర్యల ఆలస్యానికి సైతం కారణమవుతాయి.

ఇలాంటి రన్‌వేలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

టేబుల్‌టాప్‌ రన్‌వేలు కలిగిన విమానాశ్రయాలు మన దేశంలో మూడు చోట్ల ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరు, కేరళలోని కోజికోడ్‌, మిజోరంలోని లెంగ్‌వ్యూలలో ఉన్నాయి. అన్ని రకాల విమానాలు ఈ టేబుల్‌టాప్‌ రన్‌వేలపై దిగడానికి అనుకూలం కాదు. షార్ట్‌ ఫీల్డ్‌ పెర్ఫార్మెన్స్‌(ఎస్‌ఎఫ్‌పీ) సాంకేతికత ఉన్న విమానాలు మాత్రమే దిగగలవు. సాధారణ రన్‌వేలపై దించిన విధంగానే వీటిపైనా విమానాలను దించేందుకు ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళూరు విమాన ప్రమాదానికి కూడా ఇలాంటి ప్రయత్నమే కారణమని స్పష్టమైంది.

  • కోజికోడ్‌ విమానాశ్రయం:

కోజికోడ్‌ విమానాశ్రయాన్ని కరిపూర్‌ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. కోజికోడ్‌, మలప్పురం నగరాల ప్రజలకు సేవలందించే అంతర్జాతీయ విమానాశ్రయమిది. మలప్పురానికి 25 కి.మీలు, కోజికోడ్​కు 28 కి.మీల దూరంలో ఉంది. కొండపైన భూభాగంలో నిర్మించిన ఈ రన్‌వేపై విమానాలను ల్యాండ్‌ చేయడం పైలట్లకు పెను సవాలే.

కోజికోడ్‌ విమానాశ్రయం
  • లెంగ్‌ప్యూ విమానాశ్రయం:

మిజోరంలోని లెంగ్‌ప్యూ విమానాశ్రయంలో 2500 మీటర్ల రన్‌వే ఎంతో ప్రత్యేకమైనది. దీని కింద కొండలు ఉన్నాయి. దృష్టి భ్రమను కలిగించే మూడు టేబుల్‌ రన్‌వే విమానాశ్రయాల్లో ఇదీ ఒకటి. సముద్ర మట్టానికి 504 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం.. ఐజాల్‌ నుంచి 32 కి.మీల దూరంలో ఉంది.

లెంగ్‌ప్యూ విమానాశ్రయం
  • మంగళూరు విమానాశ్రయం:

మంగళూరు విమానాశ్రయం కూడా కొండపైనే ఉంటుంది. రెండు టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉంటాయి. దేశీయ విమానాలు పరిమితంగానే నడుస్తాయి. ప్రధానంగా ముంబయి, బెంగళూరుకే ఇక్కడి నుంచి విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. రెండు రన్‌వేలలో ఒకటి 1615 మీటర్లు కాగా.. రెండోది 2450 మీటర్లుగా ఉంది.

సరిగ్గా పదేళ్ల క్రితం..

అది 2010 మే 22. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఉదయం 6గంటల సమయంలో మంగళూరు విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికే విమానాన్ని దించాలా వద్దా అనే సందిగ్ధంలో పైలట్‌ ఉన్నారు. ల్యాండింగ్‌ వద్దు.. వెనక్కి వెళ్దాం అని కోపైలట్‌ పైలట్‌కు మూడుసార్లు చెప్పారు. అంతలోనే విమానం రన్‌వేను దాటి కొండ వారగా పడిపోవడం, మంటల్లో చిక్కుకోవడం జరిగిపోయాయి. ఆ ప్రమాదంలో విమాన సిబ్బందితో పాటు మొత్తం 158 మంది మృత్యువాతపడగా.. ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ఇదీ చదవండి:అనుకున్నట్లే జరిగింది.. విమాన ప్రమాదానికి కారణం అదే!

ABOUT THE AUTHOR

...view details