తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమ్మో'నియం నైట్రేట్‌! ఇంత ప్రమాదకరమా? - అమ్మోనియం నైట్రేట్‌ జాగ్రత్తలు

బీరుట్​ పేలుడుతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అమ్మోనియం నైట్రేట్​ నిల్వల ద్వారా గతంలో జరిగిన భారీ ప్రమాదాలను ఈ ఘటన గుర్తుచేసింది. దీని నిల్వలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూనే.. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా పెను విధ్వంసమేనని నిరూపించింది. ఈ నేపథ్యంలో భారత్​ ఏటా దిగుమతి చేసుకొంటున్న 2.50 లక్షల టన్నుల అమ్మోనియంపై మరింత పర్యవేక్షణ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

AMMONIUM NITRATE
అమ్మోనియం నైట్రేట్‌

By

Published : Aug 6, 2020, 7:02 AM IST

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో భారీ పేలుడు యావత్‌ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను అన్ని దేశాలకు మరోసారి నొక్కిచెప్పింది. సాధారణ పరిస్థితుల్లో శాంతంగా ఉన్నట్లు కనిపించే ఈ రసాయనం.. పరిస్థితుల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఎంతటి విధ్వంసం సృష్టించగలదో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలో అసలు అమ్మోనియం నైట్రేట్‌ అంటే ఏంటి? దాన్ని ఏ రంగంలో ఎక్కువగా వినియోగిస్తారు? ఈ పదార్థాన్ని భారత్‌ దిగుమతి చేసుకుంటోందా? వంటి విషయాలను ఓసారి పరిశీలిద్దాం.

ఏమిటీ రసాయనం?

అమ్మోనియం నైట్రేట్‌ (ఎన్‌హెచ్‌4ఎన్‌ఓ3) ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించే పారిశ్రామిక రసాయనం. తెల్లగా స్ఫటిక రూపంలో ఉంటుంది. ఇది నీళ్లలో కరుగుతుంది. ఎరువుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గనులు, నిర్మాణ రంగంలో పేలుళ్ల కోసం తయారు చేసే పేలుడు పదార్థాల్లో ఇది ప్రధాన పదార్థం. అమ్మోనియం నైట్రేట్‌ నేరుగా భూమిలో దొరకదు. దీన్ని రసాయనికంగా తయారు చేసుకోవాలి. నైట్రిక్‌ యాసిడ్‌తో అమ్మోనియా చర్య పొందినప్పుడు ఇది తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున తయారు చేస్తారు. తక్కువ ధరకే లభిస్తుంది.

ఎలా పేలుతుంది?

ప్రమాదకర వస్తువులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి వర్గీకరణ ప్రకారం ఇది ఒక ఆక్సిడైజర్‌ (గ్రేడ్‌ 5.1). స్వచ్ఛ రూపంలోని అమ్మోనియం నైట్రేట్‌ పేలుడు పదార్థం కాదు. భారీమొత్తాల్లో నిల్వ ఉంచితే అగ్ని ప్రమాదం ముప్పు, పేలుడు ముప్పు ఎక్కువగానే ఉంటుంది. పెద్ద ఎత్తున నిల్వలున్నప్పుడు కొద్ది కొద్దిగా తేమను పీల్చుకుంటూ స్ఫటికాలన్నీ కలిసి పెద్ద రాయిలా తయారవుతాయి. దీంతో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. పేలుడు రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి- ఏదైనా పేలుడు పదార్థంతో కలిసిపోయినప్పుడు డిటొనేషన్‌ జరిగి పేలుడు సంభవిస్తుంది. దీన్ని ఫ్యూయల్‌ ఆయిల్‌తో కలిపి డిటొనేటర్లను తయారు చేస్తారు. రెండోది- ఈ పదార్థంలో భారీఎత్తున ఆక్సిడేషన్‌ ప్రక్రియ జరగడం వల్ల ఉష్ణం జనించి మంటలు వ్యాపించి పేలుడు సంభవించొచ్చు. బీరుట్‌ రేవులో పేలుడుకు ప్రాథమికంగా రెండో అంశమే కారణంగా కనిపిస్తోంది.

పేలుడుతో విష వాయువులు

అమ్మోనియం నైట్రేట్‌ పేలినప్పుడు నైట్రోజన్‌ ఆక్సైడ్‌, అమ్మోనియా వంటి విష వాయువులు విడుదలవుతాయి.

భారత్‌లో పరిస్థితి

భారత్‌లో పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసే పేలుడు పదార్థాల్లో, వైద్య చికిత్సలో భాగంగా ఇచ్చే అనెస్తిటిక్‌ వాయువుల్లో, ఎరువుల్లో, అమ్మోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశంలో ఈ పదార్థం వినియోగం ఎక్కువే కాబట్టి దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించింది. తయారీ, ప్యాకింగ్‌, ఎగుమతి, రవాణా, దగ్గర ఉంచుకోవడం, విక్రయం, వినియోగం వంటివన్నీ అమ్మోనియం నైట్రేట్‌ నిబంధనలు- 2012 కిందకు వస్తాయి. ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో నిల్వ ఉంచడం చట్ట విరుద్ధం. తయారీకి పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం- 1951 కింద అనుమతి అవసరం. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) ఈ అనుమతులు జారీ చేస్తుంది. అనుమతులకు 1884 నాటి పేలుడు పదార్థాల చట్టం కూడా వర్తిస్తుంది.

కర్మాగారాల్లో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే. సాధారణ ప్రాంతాల ద్వారా రవాణా చేస్తున్నప్పుడు సమర్థులైన సాధారణ గార్డులను పంపిస్తే సరిపోతుంది. ఇందుకు అయ్యే ఖర్చును సంబంధిత లైసెన్సుదారే భరించాల్సి ఉంటుంది. సున్నిత ప్రాంతాల ద్వారా తరలించాల్సి వచ్చినప్పుడు మాత్రం సాయుధులైన పోలీసులను వెంట పంపాలి. అమ్మోనియం నైట్రేట్‌ లెక్కల్లో తేడా వచ్చినప్పుడు, చోరీ జరిగినప్పుడు వెంటనే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో, జిల్లా యంత్రాంగం వద్ద ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అమ్మోనియం నైట్రేట్‌ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే అనమతులను పెసో లేదా జిల్లా యంత్రాంగం రద్దు చేయవచ్చు.

దుర్వినియోగం చేస్తున్న ఉగ్రవాదులు

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు ఎక్కువ చోట్ల ఉపయోగించే మెరుగుపర్చిన పేలుడు పరికరాల్లో (ఐఈడీ) ప్రధాన పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ ఫ్యూయెల్‌ఆయిల్‌ (ఏఎన్‌ఎఫ్‌ఓ). దాన్ని పేల్చడానికి ప్రాథమికంగా ఆర్‌డీఎక్స్‌ లేదా టీఎన్‌టీ వంటి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారు. భారత్‌లోని పుల్వామా, వారణాసి, మాలేగావ్‌, పుణె, దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి వంటి చోట్ల జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఆర్‌డీఎక్స్‌ వంటి ప్రాథమిక పేలుడు పదార్థంతో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించారు.

గతంలో జరిగిన పెద్ద ప్రమాదాలు

  • 1921: జర్మనీలోని ఒప్పావ్‌లో 4,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలుడుకు కారణమయింది. 500 మందికి పైగా మరణించారు.
  • 1947: అమెరికా-టెక్సాస్‌లోని గాల్వెస్టన్‌ బేలో ఓడలో ఉన్న 2 వేల టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌ పేలింది. 600 మంది మరణించారు.
  • 2015: చైనా ఉత్తర ప్రాంతంలోని తియాన్‌జిన్‌ రేవులో అమ్మోనియం నైట్రేట్‌, ఇతర రసాయనాలు పేలి దాదాపు 170 మంది మరణించారు.

ఇదీ చదవండి:బీరుట్​ పేలుడులో 135కి చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details