తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూకే 'సైకిల్'​ మంత్రాన్ని భారత్​ జపిస్తుందా..? - యూకే సైకిల్​ మంత్రం భారత్​ జపించేనా?

కరోనా వల్ల స్థూలకాయంతో బాధపడుతున్న వారి ప్రాణానికి మరింత ముప్పు పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊబకాయులను వ్యాయామంతో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది యూకే ప్రభుత్వం. ఇందుకోసం సైక్లింగ్​ను ఎంచుకుంది. ప్రత్యేకంగా నిధులనూ కేటాయించింది. అయితే రికార్డు స్థాయిలో ఊబకాయులు పెరిగిపోతున్న భారత్​లో కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Experts want India to follow UK's anti-obesity drive with cycling focus
యూకే సైకిల్​ మంత్రం భారత్​ జపించేనా?

By

Published : Sep 23, 2020, 3:30 PM IST

"2012లో భారత్​లో ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలు 25.2 మిలియన్లు. 2016 నాటికి ఆ సంఖ్య 34.3 మిలియన్లకు పెరిగింది. 2019 నాటికి స్థూలకాయంతో ఇబ్బందులు పడుతున్నవారు ఏకంగా 135 మిలియన్లకు చేరుకున్నారు. "

భారత్​లో స్థూలకాయం తీవ్రతపై ఐక్యరాజ్య సమితి చెప్పిన గణాంకాలు ఇవీ.

"అధిక బరువు ఉన్న వారికి కరోనా కారణంగా ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. వారికి ఐసీయూ తప్పనిసరిగా అవసరం అవుతుంది"

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్​ఈ) తాజా నివేదికలోని సారాంశం ఇదీ..

పీహెచ్​ఈ నివేదికకు స్పందించిన బిటన్​ ప్రభుత్వం.. దేశ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. వ్యాయామంతో కూడిన ప్రయాణాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న ప్రధాని బోరిస్​ జాన్సన్..​ సైక్లింగ్​ దానికి చక్కటి మార్గమని భావించారు.

అందులో భాగంగా దేశవ్యాప్తంగా వేలాది మైళ్ల సైకిల్ మార్గాలను నిర్మించడానికి పూనుకున్నారు. హైవేల్లో సైక్లిస్టులు, పాదచారుల రక్షణ కోసం 2 బిలియన్ పౌండ్లను కేటాయించారు బోరిస్​.

అలాగే అక్కడి వైద్యులూ ఆస్పత్రులకు వచ్చే రోగులను సైక్లింగ్​ వైపు ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అయితే ఊబకాయం సమస్య తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి కాగా.. ఇండియాలోనూ యూకే తరహాలో సైక్లింగ్​ను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చూట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.​

" ఊబకాయులు కరోనా వైరస్​ బారిన పడిన తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన వ్యాయామ మార్గాల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో స్థూలకాయానికి చెక్​ పెట్టడానికి యూకే ప్రభుత్వం సైక్లింగ్​ను ప్రోత్సహించాలనుకోవడం మంచి ఆలోచన. భారత్​లో కూడా అలాంటి నిర్ణయాలు అవసరం. ప్రధానంగా ముఖ్య పట్టణాల్లో బైక్​లను పక్కన పెట్టి.. సైక్లింగ్​కు అలవాటు పడేలా యంత్రాంగం చొరవ చూపాలి. "

-నవీన్ సతీజా, సీనియర్ కన్సల్టెంట్-లాప్రోస్కోపిక్ సర్జరీ, గురుగ్రామ్​

నవీన్ సతీజాతో పాటు అనేకమంది ఆరోగ్య నిపుణులు అధిక బరువు సమస్యకు సైక్లింగ్​ చక్కటి పరిష్కార మార్గమని అభిప్రాయపడుతున్నారు.

కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం, జిమ్​లు తెరుచుకోకపోవడం, సామూహిక వ్యాయామాలకు దూరంగా ఉండటం వల్ల దేశంలో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు గురుగ్రామ్​కు చెందిన కొలంబియా ఆసియా ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమితాభా ఘోష్.

" ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామంతో కూడిన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం చాలా అవసరం. ప్రధానంగా శారీరక శ్రమ తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైకిల్​ మార్గాలను ఏర్పాటు చేసి.. ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాలి. సైక్లింగ్​ అనేది కరోనా నుంచే కాకుండా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది."

-డాక్టర్ అమితాభా ఘోష్, కొలంబియా ఆసియా ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్

దేశంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా సైక్లింగ్​ను ప్రోత్సహించడానికి బలమైన ఆరోగ్య విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ప్రముఖ సైకిల్​ తయారీ కంపెనీ హీరో మోటార్స్​ ఛైర్మన్​, ఎండీ పంకజ్​ ముంజల్​.

" సైక్లింగ్​ విషయంలో యూకే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. బ్రిటన్​ను అనుసరించేందుకు చాలా దేశాలు సిద్ధమవుతున్నాయి. సైక్లింగ్​ విషయంలో యూకేను భారత్​ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది."

-పంకజ్​ ముంజల్​, హీరో మోటార్స్​ ఛైర్మన్

సైక్లింగ్​ వల్ల అదనపు ప్రయోజనాలు..

పలు అధ్యయనాలు సైక్లింగ్​ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాయి.

  • సైకిల్​ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఎముకలు బలపడతాయి.
  • బరువు తగ్గుతారు.
  • ఒత్తిడిని జయిస్తారు.
  • ఫిట్​గా ఉంటారు.
  • వాయు కాలుష్యం తగ్గుతుంది.
  • ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్​స్టిట్యూట్​ (టెరి) అధ్యయనం ప్రకారం.. ప్రజలు సైక్లింగ్​ చేయడం వల్ల భారతదేశంలో ఏటా రూ.1.8 ట్రిలియన్ల ఇంధన వ్యయం ఆదా అవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల సైకిల్​కు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని హెచ్‌ఎంసీ గ్రూప్ తెలిపింది. సైకిల్​ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: 'సైకిల్​'కు ఇక స్వర్ణ యుగమే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details