చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైనట్లు అనుమానిస్తున్న కొవిడ్-19 తాజాగా భారత్‌లో కోరలు చాచింది. ఇక్కడ కూడా చైనాలో విజృంభించిన పద్ధతిని అనుసరించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్) అభిప్రాయపడింది. ఈ వైరస్ వ్యాప్తి.. చైనాలో మాదిరిగానే భారత్‌లో ప్రభావంచూపే అవకాశముందని ఐసీఎమ్‌ఆర్ డైరక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమూహవ్యాప్తి దశకు చేరేందుకు కేవలం 30 రోజల సమయం మాత్రమే ఉందన్నారు.
ఇప్పుడే అడ్డుకోవాలి..
ప్రస్తుతమున్న అత్యంత కీలకదశలోనే ఈ వైరస్ తీవ్రతను అడ్డుకోగలిగితే రాబోయే రోజుల్లో సమూహవ్యాప్తికి చేరకుండా అడ్డుకోవచ్చన్నారు బలరాం. లేదంటే పరిస్థతి చేయిదాటిపోతుందనే ఆందోళన వెలిబుచ్చారు. కరోనా బారినపడిన వ్యక్తికి దూరంగా ఉండటం లేదా వైరస్ ప్రభావం ఉన్న దేశాలకు ప్రయాణం చేయని వ్యక్తికి కూడా వైరస్ నిర్ధరణ అవడాన్ని సమూహవ్యాప్తి దశగా అభివర్ణిస్తారు. అయితే ఈ దశ.. దేశంలో ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందనేది కచ్చితంగా చెప్పలేమని అందుకే ఐసీఎమ్‌ఆర్ దేశవ్యాప్తంగా ఉన్న 65 పరిశోధన కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు శాంపిల్స్ సేకరిస్తూ పరిశోధనలు చేస్తోంది.
4 దశల్లో వైరస్ విజృంభణ
ఈ వైరస్ వ్యాప్తి ముఖ్యంగా 4 దశల్లో ఉంటుందని ఐసీఎమ్‌ఆర్ నిపుణులు తెలియజేశారు. మొదటి దశ- విదేశాలనుంచి ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం, రెండవ దశ- వైరస్ సోకిన వ్యక్తి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందడం, మూడవ దశ- సమూహవ్యాప్తి, నాలుగవ దశలో ఎపిడమిక్‌గా మారడం జరుగుతుంది. ఇలా నాలుగు దశల్లో వైరస్ వ్యాప్తి ఉంటుందని, ప్రస్తుతం భారత్ రెండో దశలోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ దశలోనే వైరస్ వ్యాప్తిని కచ్చితంగా అరికట్టగలిగితేనే మూడవ దశకు చేరకుండా ఉండగలం. లేనట్లయితే, మూడో దశను ఎదుర్కొంటున్న ఇటలీ, చైనా, అమెరికా, యూరప్ లాంటి పరిస్థితే మనం ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే.. ఆ దశకు చేరడం అనివార్యమైనప్పటికీ ప్రస్తుతం దాన్నుంచి తప్పించుకోవడానికి ఇంకా అవకాశముందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్వక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేయడం వంటి చర్యలు సమూహవ్యాప్తిని అరికట్టగలవని సూచిస్తున్నారు.