తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉపరితలం ఎలా తుడుస్తున్నాం? నిపుణుల సూచనలివే

కరోనా భయాలు అలముకున్న వేళ అందరూ పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు రకరకాల రసాయన ద్రావణాలను వినియోగిస్తున్నారు. వాటిని కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది? ఇలాంటి పలు సందేహాలపై నిపుణుల సూచనలు మీకోసం..

Expert instructions on insecticides and sanitizers
శానిటైజర్స్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By

Published : May 14, 2020, 6:46 AM IST

కరోనా వైరస్‌ విజృంభించడం వల్ల ప్రజలు పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తాము తాకిన ప్రతి వస్తువును, తర్వాత చేతులనూ శుభ్రం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తలుపుల పిడులు, వాహనాల తలుపులు... తదితరాలను తరచూ తుడుస్తున్నారు. ఇందుకోసం రకరకాల రసాయన ద్రావణాలను వినియోగిస్తున్నారు. వీటితో ఎంతమేరకు ప్రయోజనం ఉంటుంది? ద్రావణాన్ని పిచికారీ చేసిన వెంటనే తుడిచేయవచ్చా? వాటిని కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... వంటి సందేహాలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

ద్రావణం దేన్ని నిర్మూలిస్తుంది?

ఒక్కో క్రిమి సంహారిణిని ఒక్కో ఉపయోగానికి ఉత్పత్తి చేస్తారు. ఇదే విషయాన్ని ద్రావణం సీసాపై ముద్రిస్తారు. 'శానిటైజ్‌' అని రాసుంటే కేవలం బ్యాక్టీరియాల తీవ్రతను తగ్గిస్తాయి. వైరస్‌లను కాదు. డిస్‌ఇన్ఫెక్ట్‌ అని రాసుంటే మాత్రం రెండింటిపైనా పనిచేస్తుంది.

వెంటనే తుడవొచ్చా?

ఒక వస్తువు ఉపరితలంపై రసాయనం పిచికారీ చేశాక కొంతసేపు వేచి ఉండటం మంచిది. అప్పుడే అది ఉపరితలం మొత్తం వ్యాపించి క్రిములపై పనిచేస్తుంది. రసాయనాల రకాలకు అనుగుణంగా కనీసం 30 సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు వేచిచూసి తర్వాత తుడవాలి.

ఎందుకీ కచ్చితమైన సమయం...

బ్యాక్టీరియా, వైరస్‌లపై ఏదైనా రసాయన ద్రావణం ఎలా పనిచేస్తుందనే అంశంపై ఈ సమయం ఆధారపడి ఉంటుంది. అది డిస్‌ఇన్ఫెక్ట్‌ అని ప్రకటించడానికి కఠిన పరీక్షలు చేస్తారు. ఆయా దేశాల్లోని కాలుష్య నియంత్రణ సంస్థలు వాటిని పరీక్షిస్తాయి. సాధారణంగా ఇళ్లు, ఆసుపత్రుల్లో చదరపు సెంటీమీటర్‌కు 100 క్రిముల వరకు ఉంటాయి. కానీ, ప్రయోగ పరీక్షలప్పుడు శాస్త్రవేత్తలు చదరపు సెంటీమీటర్‌కు లక్ష క్రిములను వేస్తారు. సంబంధిత రసాయనం ఎంతసేపట్లో క్రిములను చంపుతుందో లెక్కిస్తారు. అందుకనుగుణంగానే మనమూ వేచి ఉండాలి.

సమయాన్ని ఎలా లెక్కించుకోవాలి?

వస్తువులు, ఫ్లోర్‌ ఉపరితలంపై రసాయనాన్ని పిచికారీ చేసి, తుడిచాక... అది పూర్తిగా ఆవిరయ్యే సమయాన్ని గమనించాలి. ఉదాహరణకు డిస్‌ఇన్ఫెక్టర్‌ చల్లాక 4నిమిషాలు ఉండాలని ఉంటే.. మనం పూర్తిగా 4నిమిషాలు వేచి చూసి తుడవాల్సిన అవసరం లేదు. చల్లినప్పటి నుంచి దాన్ని తుడిచాక ఉపరితలంపై ఇంకిపోయే వరకు సమయం 4నిమిషాలైతే చాలు. ఇక బాత్‌రూమ్‌లు, టాయిలెట్ల వంటిచోట్ల తుడిచిన పరికరాలను ఇంట్లోని ఇతర గదుల్లో వాడొద్దు.

దుమ్ము, ధూళి ఉండొద్దు

క్రిమి సంహారిణి వినియోగించే ముందు ఆయా ఉపరితలాలపై దుమ్ము, ధూళి, చెత్త లేకుండా శుభ్రపర్చాలి. అవి ఉంటే... రసాయనాలు క్రిముల వరకు చేరుకోలేవు, నిర్మూలించలేవు. దాదాపు అన్ని క్రిమి సంహారిణుల డబ్బాలపై ఇదే విషయం స్పష్టంగా రాసి ఉంటుంది.

కరోనా వైరస్‌పై వాడాల్సినవి...

సార్స్‌ కోవ్‌-2 కొత్త వైరస్‌ కావడంతో దీనిపై వివిధ ఉత్పత్తులను పరీక్షించే సమయం లేదు. ఇక్కడ సానుకూల అంశం ఏమిటంటే... ఒక ఉపరితలంపై ఈకొలి, సాల్మోనెల్లా వంటి బాక్టీరియాల కంటే కరోనాను అంతం చేయడం తేలికని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలినట్లు అమెరికా నిపుణులు వెల్లడించారు.

ఇదీ చూడండి:కరోనా ఆర్థిక ప్యాకేజీ తొలిరోజు ముఖ్యాంశాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details