కరోనా టీకా అడ్మినిష్ట్రేషన్పై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం బుధవారం తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా స్వదేశీ, విదేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్ కొనుగోలు విధానాలతో పాటు, వ్యాక్సిన్ ముందుగా ఎవరికి ఇవ్వాలన్న అంశాలపై సభ్యులు చర్చించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకేపాల్ నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం సమావేశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు తమ మార్గాల ద్వారా టీకా సేకరణ చేయవద్దని సూచించినట్లు తెలిపింది.
వ్యాక్సిన్ తయారీతో పాటు దేశంలో ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు పాటించాల్సిన విధివిధానాలు, మౌలిక సదుపాయాలపై చర్చించారు. పలు సంస్థలు టీకా తయారీకి కృషి చేస్తున్నాయి. ఏ సంస్థ టీకాకు అనుమతులు ఇవ్వాలి, ఆయా సంస్థల్లో పరిశోధన ఏ స్థాయిలో ఉందో సమీక్షించారు. వ్యాక్సిన్లపై జాతీయ సాంకేతిక సలహా బృందం నుంచి కూడా వివరాలు కోరింది కమిటీ. టీకా ప్రక్రియను ట్రాక్ చేయడానికి ఉన్న వ్యవస్థలు, నూతనంగా తీసుకురావాల్సిన విధానాలు, వ్యాక్సిన్ భద్రత, నిఘాకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి.. వాటిని ఎలా అధిగమించాలనే వ్యూహాలపై కూడా చర్చించారు.
- కేంద్ర ఆరోగ్య శాఖ.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్