దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో దిల్లీ తీస్‌హజారీ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. ఈ నెల 18న శిక్ష ఖరారుపై కోర్టు వాదనలు విననుంది.
ఉన్నావ్ అత్యాచార ఘటనలో దిల్లీ తీస్‌హజారీ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు.. లఖ్‌నవూ కోర్టు నుంచి గత ఆగస్టులో దిల్లీ కోర్టుకు బదిలీకాగా రోజువారీ విచారణ అనంతరం ఇవాళ తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతి సహా.. పోక్సో చట్టం కింద సెంగార్‌ను దోషిగా తేల్చింది.
కోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే సెంగార్ కోర్టు గదిలో కుప్పకూలిపోయారు. అతని సోదరి పక్కన ఏడుస్తూ కనిపించారు.
శిక్ష ఖరారుపై న్యాయస్థానం ఈనెల 18న వాదనలు విననుంది. సాధారణంగా ఈ నేరానికి జీవితఖైదు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి సాషి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
ఈ కేసు విచారణ విషయంలో ప్రతీ చోటా నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలిని, కుటుంబసభ్యులను నిందితులు బెదిరిస్తుంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాజకీయనాయకుడు కావడం వల్ల అతడికి అనుకూలంగా వ్యవహరించారని, బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు పట్టించుకోలేదని న్యాయస్థానం పేర్కొంది.
2017లో ఘటన...
2017లో మైనర్ బాలికపై ఉన్నావ్‌లో అత్యాచార ఘటన జరిగింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బంగేర్‌మౌ నుంచి నాలుగు సార్లు భాజపా ఎమ్మెల్యేగా గెలుపొందిన కుల్‌దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు కారణంగా ఆ పార్టీ ఈ ఏడాది ఆగస్టులో సెంగార్‌ను బహిష్కరించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లఖ్‌నవూ నుంచి దిల్లీ కోర్టుకు ఈ కేసు బదిలీ అయిన అనంతరం జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ రోజువారీ విచారణ చేపట్టారు. ఈ కేసులో ఓ నిందితుడిని అప్పట్లో అరెస్టు చేయగా గత నెల 25నే విడుదలయ్యాడు. అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. బాధితురాలు, ఆమె తరఫు బందువులు రాయబరేలికి వెళ్తుండగా వారి కారును ట్రక్ ఢీకొంది. ఆ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.