కరోనా వైరస్ కట్టడికి కేంద్రం 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి, కష్టాల్లో పడ్డారు. ఉన్నచోట ఉపాధి లేక సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. దిల్లీలోని ఉత్తర్‌ప్రదేశ్ వాసులు, ముంబయిలో ఉన్న గుజరాత్ వాసులు సొంత ఊళ్ల బాటపట్టారు. వందల కిలోమీటర్ల దూరమైనప్పటికీ కాలినడకనే పయనం సాగిస్తున్నారు.
వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. తక్షణమే సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వారికి తెలియజేయాలని కోరింది. ఇందుకోసం వలంటీర్లు, ఎన్జీఓల సేవలను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది.
అండగా ఉంటాం
ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలకు తక్షణం ఆహారం, దుస్తులు, వసతి సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు వలస కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 21 రోజుల లాక్డౌన్ సమయంలో అన్నివిధాల సాయం అందిస్తామని తెలిపారు.
కూలీల కోసం విపత్తు నిధులు
వలస కూలీలను ఆదుకునేందుకు విపత్తు ప్రతిస్పందన నిబంధనలను కేంద్ర హోంశాఖ సవరించింది. రాష్ట్రాలకు అందించే విపత్తు స్పందన నిధులను వలస కూలీల కోసం ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ఇప్పటికే రూ.29,000 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఈ నిధులను లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల వైద్య, తాత్కాలిక వసతి కల్పించేందుకు వినియోగించవచ్చని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త నిబంధనలు వలస కూలీలతోపాటు నిరాశ్రయులకు వర్తిస్తాయని చెప్పారు.
సొంత ఊళ్లకు వెళ్లేందుకే మొగ్గు..
ఆయా రాష్ట్రప్రభుత్వాలు వలస కూలీలకు ఆహార భద్రత కల్పిస్తామని ప్రకటించినప్పటికీ, కూలీలు మాత్రం సొంత ఊళ్లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం రాత్రి దిల్లీ-యూపీ సరిహద్దు ఘజియాబాద్ వద్దకు వేలాదిగా చేరుకున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 24 గంటలకుపైగా నుంచి వేచివున్న కూలీలను ఇళ్లకు చేర్చేందుకు 1000 బస్సులను దిల్లీ-యూపీ సరిహద్దులకు పంపింది. ఘజియాబాద్, నోయిడాలోని వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలిస్తోంది.