సార్వత్రిక ఎన్నికల్లో గెలుచేదెవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. ఇంచుమించుగా అన్ని సర్వే సంస్థలు మరోసారి ఎన్డీఏ గెలుపు ఖాయమని అభిప్రాయపడ్డాయి.
భాజపా వైపే మొగ్గు
టైమ్స్‌నౌ-వీఎమ్ఆర్ సంస్థ ఎన్డీఏ కూటమి 306 స్థానాలు గెలుచుకోనుందని అంచనా వేసింది. యూపీఏ కూటమి ఖాతాలో 132 స్థానాలు మాత్రమే పడనున్నాయని స్పష్టం చేసింది. ఇతరులు 104 చోట్ల గెలుస్తారని పేర్కొంది.
రిపబ్లిక్ టీవీ, సీ-ఓటర్ అంచనా సైతం ఎన్డీఏకే పట్టం కట్టింది. భాజపా మిత్రపక్షాలు 287 స్థానాలు గెలుచుకోనున్నాయని, యూపీఏ కూటమి 128 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది.
జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఎన్డీఏ 295 నుంచి 315 స్థానాలు , యూపీఏ 122-125, ఇతరులు 102-125 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఎన్డీఏ కూటమి 333 స్థానాల్లో విజయం సాధించనుందని వీడీపీఏ సంస్థ అంచనా వేసింది. యూపీఏ కూటమి 115, ఇతరులు 94 సీట్లు రావొచ్చని పేర్కొంది.
న్యూస్ నేషన్, న్యూస్ ఎక్స్, న్యూస్-18 ఎగ్జిట్‌పోల్స్ సైతం ఎన్డీఏ గెలవనుందనే అంచనా వేశాయి. న్యూస్ నేషన్.. ఎన్డీఏకు 282 నుంచి 290 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, న్యూస్ ఎక్స్ 298 స్థానాలు, న్యూస్ 18 సర్వే 336 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకోనుందని వెల్లడించాయి.
ఏబీపీ సర్వే.. హంగ్
కేంద్రంలో హంగ్ ఏర్పడనుందనిఏబీపీ న్యూస్ మాత్రమే అంచనా వేసింది. ఎన్డీఏ మేజిక్ ఫిగర్ కంటే ఆరు స్థానాలు తక్కువగా 267 సీట్లు, యూపీఏ 127, ఇతరులు 148 స్థానాలు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఎగ్జిట్‌పోల్స్ భాజపావైపే మొగ్గు చూపుతున్న తరుణంలో... తుది ఫలితాలు ఎవరికి అధికారాన్ని కట్టబెడతాయో కొద్దిగంటల్లో తేలనుంది.
ఇదీ చూడండి: డమ్మీ స్మార్ట్ఫోన్లతో దొంగలకే టోకరా...