తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: 'విక్రమ్'​ జాడను 'షణ్ముగ' కనుగొన్నారిలా... - NASA for identifying the debris of Vikram Lander

'విక్రమ్​' ల్యాండర్​ ఏమైంది? చంద్రయాన్​-2 ప్రయోగం తర్వాత అనేక నెలలపాటు సర్వత్రా ఇదే చర్చ. జాబిల్లిని బలంగా ఢీకొట్టిన విక్రమ్​ జాడను కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి ఇస్రో, నాసా. అయినా ఫలితం లేదు. అనూహ్యంగా ల్యాండర్​​ జాడ ఓ సామాన్య పౌరుడికి చిక్కింది. ఆయనతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి...

Exclusive sound bite of Shanmuga Subramanian who was credited by NASA for identifying the debris of Vikram Lander
చంద్రయాన్​-2: 'విక్రమ్'​ జాడను 'షణ్ముగ' కనుగొన్నారిలా...

By

Published : Dec 3, 2019, 5:25 PM IST


కోట్ల మంది భారతీయుల కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2.. చివరి దశలో తడబడింది. అయితేనేం.. మన ఇస్రో శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్లను, అనుభవాలను మిగిల్చింది. జాబిల్లి ఉపరితలాన్ని ఆఖరి నిమిషంలో గట్టిగా ఢీకొట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడ కనుక్కోవడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తలమునకలయ్యాయి. కానీ, ల్యాండర్ ఆచూకీ చిక్కలేదు. అయినా ప్రయత్నాలు కొనసాగించాయి. ఎట్టకేలకు దాని కచ్చితమైన జాడ ఒక భారతీయుడికే చిక్కింది.

చెన్నైకు చెందిన ఓ మెకానికల్​ ఇంజినీర్ షణ్ముగ సుబ్రహ్మణియన్‌ ఇచ్చిన ఆధారమే విక్రమ్ జాడ కనుక్కోవడంలో నాసాకు కీలకమైంది. చివరకు నాసా విక్రమ్‌ జాడను గుర్తించింది.

ఎవరీ షణ్ముగ...?

షణ్ముగ సుబ్రహ్మణియన్‌.. తిరునల్వేలిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్​ కళాశాలలో మెకానికల్​ ఇంజినీర్​గా పట్టా పొందారు. గత పదేళ్లకుపైగా సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నారు. సాంకేతిక అంశాలపై బ్లాగ్స్​ రాస్తుంటారు. చంద్రయాన్‌-2తో, నాసాతో ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. విక్రమ్‌ జాడను నాసా కూడా కనుక్కోలేకపోవడం ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. మనమెందుకు ఓ ప్రయత్నం చేయొద్దని అనుకున్నారు షణ్ముగ. సవాల్‌గా స్వీకరించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. విజయం సాధించారు.

ఇంతటి ఘనత సాధించిన షణ్ముగ సుబ్రహ్మణియన్​.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ పరిశోధన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈటీవీ భారత్​తో షణ్ముగ సుబ్రహ్మణియన్ ముఖాముఖి

"నేను ఇందుకోసం చాలా రోజులుగా కష్టపడ్డాను. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్​ దిగాల్సిన ప్రాంతం ఫొటోలను నాసా గతంలో తన బ్లాగ్​లో ఉంచింది. ఆ చిత్రాలను డౌన్​లోడ్ చేసుకుని.. కొత్త వాటితో క్షుణ్నంగా పోల్చి చూశాను. అప్పుడే ఆ రెండు చిత్రాల మధ్య తేడా కనిపెట్టగలిగాను. అదే విషయాన్ని అక్టోబర్​ 3న ఇస్రో, నాసాకు ట్వీట్​ ద్వారా తెలియజేశాను. ఆ తర్వాత అన్ని ఆధారాలతో నాసాకు మరోమారు ఈ-మెయిల్ పంపాను. నా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఈ రోజు నాసా ఈ-మెయిల్ పంపింది.

3-4 రోజులు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు ఈ పరిశోధనకు కేటాయించాను. అది కూడా నా ఖాళీ సమయం. రాత్రి 9 నుంచి 2 గంటలు, ఉదయాన్నే 6 నుంచి 8 గంటల వరకు దీనిపై పరిశోధన చేశాను. ఇందుకోసం నేను ఎలాంటి ప్రత్యేక సాంకేతికతను వినియోగించలేదు. సాధారణ 'ఇమేజ్​ కంపారిజన్​ టెక్నాలజీ'ని మాత్రమే ఉపయోగించాను.

నేను మెకానికల్​ ఇంజినీర్​ను. తిరునల్వేలిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించాను. గత పదేళ్లకుపైగా ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. అదే విధంగా ఎప్పటికప్పుడు యాప్స్​, వెబ్​సైట్లు కూడా తయారు చేస్తుంటాను. ఇది నాకేమీ కొత్త కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిశోధనలు చేస్తూనే ఉన్నాను."
- షణ్ముగ సుబ్రహ్మణియన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details