భాజపా సీనియర్ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తన ఎన్నో ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశానికి చిరస్మరణీయ సేవలు అందించి సుష్మా స్వరాజ్ కీలక నేతగా ఎదిగారు. గల్ఫ్ తదితర దేశాల్లో చిక్కుకున్న ఎందరో భారతీయులను విడిపించి.. మహిళలకు అండగా ఉంటూ ఇలా ప్రతి విషయంలోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు రప్పించడంలో సుష్మా సేవలు మరువలేనివి. ఇందుకు ఆమె ఎంచుకున్న ఆయుధం ట్విట్టర్. సుష్మా స్వరాజ్ తుదిశ్వాస విడితే కొద్ది గంటల ముందు ఆమె ట్వీట్ ఏంటో తెలుసా. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ-370 రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌తో మరింత ప్రసిద్ధి చెందిన సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే. మంగళవారం సాయంత్రం 7 గంటల 23 నిమిషాల సమయంలో ఈ ట్వీట్ చేశారామె. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదంతో సుష్మా హర్షం వ్యక్తం చేశారు.
''ప్రధాని నరేంద్రమోదీకి నా ధన్యవాదాలు. నా జీవితంలో ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాను.''
-సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్