తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాథ్రస్‌ నిందితులు అమాయకులు.. యువతి కుటుంబంపై ఎఫ్​ఐఆర్!

ఉత్తర్​ప్రదేశ్ హాథ్రస్​ ఘటనకు కారకులైన వారికి మద్దతుగా ఓ భాజపా మాజీ ఎమ్మెల్యే తన ఇంట్లో సమావేశం నిర్వహించారు. దీనికి భారీగా హాజరైన స్థానికులు.. ఈ కేసులో నిందితులను బలంగా వెనకేసుకొచ్చారు. వారికి న్యాయం జరగాల్సిందేనని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబంపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పట్టుబట్టారు.

Ex-BJP MLA holds meeting in Hathras to back accused
హాథ్రస్‌ నిందితులు అమాయకులు

By

Published : Oct 5, 2020, 7:19 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతి హత్యాచారంపై ఓ వైపు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఘటనకు కారకులైన వారికి మద్దతుగా సమావేశం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భాజపా మాజీ ఎమ్మెల్యే రాజ్‌వీర్‌ సింగ్‌ పహిల్వాన్‌ ఆదివారం హాథ్రస్‌లోని తన నివాసంలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి భారీగా హాజరైన స్థానికులు.. ఈ కేసులో నిందితులను బలంగా వెనకేసుకొచ్చారు. వారికి న్యాయం జరగాల్సిందేనని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబంపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

అగ్రవర్ణాల భేటీకి పోలీసుల భద్రత!

బాధితురాలి నివాసానికి 9 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ సమావేశానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది అగ్రవర్ణాల వారి భేటీ అంటూ వార్తలు వచ్చాయి. వాటిని రాజ్‌వీర్‌ కుమారుడు మన్‌వీర్‌ సింగ్‌ ఖండించారు. సమాజంలో వివిధ వర్గాల వారు ఇందులో పాల్గొన్నారని చెప్పారు.

"హత్యాచార ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సీబీఐ విచారణకు సిఫార్సు చేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది" అని చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తమ వైఖరిని తరుచూ మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

"ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు ఈ వ్యవహారాన్ని సృష్టించారు. ఈ కేసులో నిందితులు ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెబుతున్నారు. బాధిత కుటుంబమే వైఖరిని మార్చుకుంటోంది. నార్కో పరీక్ష, సీబీఐ దర్యాప్తు వారికి అక్కర్లేదు. ఇప్పుడు ఇతర రకాల దర్యాప్తులను కోరుతున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలి" అని డిమాండ్‌ చేశారు. నిందితులను రక్షించేందుకు న్యాయపరమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

వామపక్ష ప్రజాసంఘాల పరామర్శ

హాథ్రస్‌లో బాధిత యువతి కుటుంబాన్ని వామపక్ష ప్రజాసంఘాలు ఆదివారం పరామర్శించి సానుభూతి తెలిపాయి. ఈ బృందంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సంయుక్త కార్యదర్శి విక్రం సింగ్‌ తదితరులు ఉన్నారు. యూపీతోపాటు, భాజపా పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

హాథ్రస్‌ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వెంకట్‌ చెప్పారు. భీమ్‌ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. యువతి కుటుంబ సభ్యులకు వై కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వామపక్ష ప్రజాసంఘాల పరామర్శ

ఇదీ చదవండి-గురుగ్రామ్​లో మరో నిర్భయ ఘటన

ABOUT THE AUTHOR

...view details