ప్రతి కుర్రాడికి తాను వలచిన అమ్మాయి అప్సరసే. అలాగే అమ్మాయికి.. మోజు పడ్డ అబ్బాయి మన్మథుడే! అలాగే ఇష్టమైన కారు సొంతం చేసుకున్నవాళ్లకి అది ప్రేయసిలాగే కనిపిస్తుంది. హెడ్‌లైట్లు.. కనుసైగ చేసే కొంటె కోణంగిలా కవ్విస్తుంటే, స్టీరింగ్.. చేతులు చాచి రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. డుగ్‌డుగ్‌మనే బైక్ పొగగొట్టం అయితే బైకర్‌కి తన లవర్ గుండెచప్పుడే!
ఇంత ప్యార్.. ఇష్క్.. మొహబ్బత్ గనకే.. బండి ఉన్న ప్రతి ఓనరూ పడ్డామండీ ప్రేమలో మరి... అని పాడుకుంటాడు. కలకాలం పదిలంగా కాపాడుకుంటానని బాసలు చేస్తుంటాడు. ఇంతకీ ఏ హొయలు చూసి వాహనం ప్రేమ మైకంలో పడిపోతారు? ఆ ప్రేమకథకు మొదటి గేర్ ఎలా పడుతుంది? ఈ ప్రేమికుల రోజున సీరియస్‌గా తెలుసుకుంటే పోలా!
ధరపైనే తొలివలపు
ప్రేమికులకు ఒకరిపై ఒకరికి వెల కట్టలేనంత ప్రేమ ఉన్నా.. బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు, పార్టీలు, షికార్లకు తిరుగుతున్నప్పుడు తమ తాహతుకు తగ్గ గిఫ్ట్‌లే ఎంచుకుంటారు. భరించగలిగే ప్రాంతాల్లోనే విహరిస్తారు. వాహన ప్రేమికులూ అంతే. ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లు, హై-ఎండ్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నా మనోళ్లు హ్యాచ్‌బాక్, సెడాన్‌లాంటి బుల్లి కార్లపైనే ఎక్కువ మనసు పడుతున్నారు. ఎందుకంటే భారత్‌లో వాహన కొనుగోలుదారుల్లో అత్యధికులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వాళ్లే. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న పది కార్లకు పది రూ.పది లక్షల్లోపు ధరవే. టాప్-5 ద్విచక్రవాహనాల్లో నాలుగు లక్షల రూపాయల లోపువే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా కొనుగోలుదారుల మొదటి చూపు ధరపైనే పడుతోంది.
మైలేజీకే ఫాలోయింగ్
తమ వలపు పాటకి పచ్చజెండా ఊపినవాళ్లతోనే అబ్బాయైనా, అమ్మాయైనా ప్రేమ గీతం పాడతారు. వాళ్ల వెనకెనకే తిరుగుతారు. సేమ్ టూ సేమ్.. మంచి మైలేజీతో మనసు దోచుకున్న బండి వెనకే పడిపోతున్నారు చోదకప్రియులు. కోటి రూపాయల కారైనా.. అరకోటి విలాసాల బైకైనా అందరి మాటా ‘కిత్తే దేతా హై?’. దానికి తగ్గట్టే గతం నుంచి ఇప్పటిదాకా అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఎప్పటికీ మొదటిస్థానం మంచి మైలేజీ ఇచ్చే బండ్లదే.
అటువైపే మనసంతా
కులమతాలు, ఆస్తిపాస్తులు చూడదంటారు ఇష్క్. కానీ ఇవి కూడా చూసి మరీ ప్రేమలో దిగే వ్యూహాత్మక ప్రేమికులకు కొదవలేదు. వాహనంతో లవ్‌లో పడేవాళ్లలో ఈ బాపతే ఎక్కువ. బండి డీజిలా? పెట్రోలా? అని చూస్తారు. బ్యాటరీనా? హైబ్రిడ్‌నా? అంటూ ఆరా తీస్తారు. గతంలో డీజిల్, పెట్రోల్ ధరల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు అంతా డీజిల్‌వైపే మొగ్గేవారు. ఇప్పుడు అంతరం తగ్గింది. పెట్రోల్ రకంపైనే ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారు. దాంతోపాటు బ్యాటరీ బండ్లు భారీ ప్రోత్సాహకాలతో ముస్తాబై తెగ కవ్విస్తుండటంతో వీటిపైనా ఓ లుక్ వేస్తున్నారు.