తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 1:03 PM IST

ETV Bharat / bharat

అమ్మభాషలో చదువుకో... ఆంగ్లమూ నేర్చుకో!

తెలుగు బోధన భాషగా ఉండాలని, కనీసం పాఠశాల చదువు వరకైనా తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరపాలనే ఉద్యమానికి పెద్దదెబ్బ తగిలింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరో తరగతి వరకు సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలోనే చదువు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. కొన్నేళ్ల నుంచి అధికారభాషగా తెలుగు పూర్తిస్థాయిలో అమలు జరపాలని కనీసం పాఠశాల విద్య వరకైనా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేయాలని భాషోద్యమకారులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఉత్తర్వు శరాఘాతంగా మారింది.

అమ్మభాషలో చదువుకో... అAఆ ఇBఈ ఆంగ్లమూ నేర్చుకో!

బహుజన సిద్ధాంతకారులు దళిత సిద్ధాంతకారులు విద్యాబోధన తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలని, ఉన్నత వర్గాల పిల్లలు అందరూ ఇంగ్లిష్‌ మీడియం చదువులు చదువుతుంటే... దళిత బహుజనుల పిల్లలు సర్కారీ బడుల్లో తెలుగు మాధ్యమంలో చదివి ఎల్లకాలం వెనకబడి ఉండాలా అనే కొత్తవాదన తెస్తున్నారు.

దళిత కులాలు, వెనకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత చదువుల అనంతరం విదేశాలకుపోయి మంచి ఉద్యోగాలు చేయాల్సిందే. అందుకు కావలసింది ఆంగ్లభాషలో ప్రావీణ్యం కాని, ఇంగ్లిష్‌ మీడియంలో చదువు కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బోధించే ఇంగ్లిష్‌ మీడియం చదువుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం బాగోలేవన్నది వాస్తవం. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివినవారిలో కొందరిని పరిశీలిస్తే అటు తెలుగులో, ఇటు ఇంగ్లిష్‌లో సరైన ప్రావీణ్యం వారికి లేదని గ్రహించవచ్చు. అరకొర సౌకర్యాలతో, అర్ధజీతాలతో పనిచేసే ప్రైవేటు కళాశాలలు ఏ ప్రమాణాలు పాటిస్తున్నాయో ప్రభుత్వ పరిశీలనలోనే చాలాసార్లు బయటపడింది. మన దగ్గర ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఎక్కువమంది ఇంగ్లాండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు పోతున్నారు. అక్కడ వారికి నేరుగా విద్యా ప్రవేశాలు, ఉద్యోగాలు లభించడం లేదు. టోఫెల్‌, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఆంగ్ల భాష పాటవానికి సంబంధించిన పరీక్షలివి. మన దగ్గర ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులూ మొదటిసారే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి, డబ్బులు పోసి శిక్షణ పొందుతున్నారు. రెండు పరీక్షలు దాటకుండా ఎవరూ పై దేశాల్లో ఉన్నత విద్యలో ప్రవేశం పొందలేరు. ఉద్యోగాలూ సాధించలేరు. జపాన్‌, చైనాల్లో తయారైన యంత్రాలను చాలా దేశాల్లో వాడుతున్నారు. తర్ఫీదు ఇవ్వడానికి ఆ రెండు దేశాల నిపుణులు ఆయా దేశాలకు వెళ్తుంటారు.

నాణ్యత ప్రశ్నార్థకం

వారంతా ఇంజినీరింగ్‌, ఇతర కంప్యూటర్‌ సాంకేతిక విద్యలను వారి భాషల్లో నేర్చుకున్నారు. ఇంగ్లిష్‌ను కనీస వ్యాపార లావాదేవీలు, దైనందిన వ్యవహారాలు నడుపుకొనేవరకే నేర్చుకుంటారు. మన దేశంలో ఇంజినీరింగ్‌ కంప్యూటర్‌ విద్యలను ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు ఆ సాంకేతిక రంగంలో వారితో పోటీ పడగలుగుతున్నారా? అలాకాక ఇంజినీరింగ్‌, వైద్యవిద్యలను ఇతర శాస్త్రాలను భారతీయ భాషల్లోనే ఆయా ప్రాంతాలవారు నేర్చుకున్నా- ఇంగ్లిష్‌ను ఒక భాషగా నేర్చుకోగలిగితే, ఇటు ఈ శాస్త్రాలనూ సులభంగా అభ్యసించవచ్చు. ఆంగ్లాన్ని ఒక భాషగా అన్ని తరగతుల్లో నేర్చుకోవడం వల్ల ఇతర దేశాల్లోనూ పని చేయడానికి వీలవుతుంది. సాంకేతిక విద్యలో మనకన్నా చాలా ముందున్న చైనా, రష్యా, జపాన్‌ దేశస్థులు వారి భాషల్లో విద్యాబోధన సాగిస్తూ మెరుగ్గా రాణిస్తున్న ఉదాహరణ మన ఎదురుగానే ఉంది. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయన్నది విడ్డూర వాదన. పౌరుల్లో ఏ వర్గం వారైనా ప్రభుత్వం నుంచి కోరవలసింది- చదువు తెలుగు మాధ్యమంలోనే ఉండాలి కాని, తమకు చక్కటి ఆంగ్లాన్ని పాఠశాల స్థాయిలోనే నేర్పించాలని, అందుకు వీలుగా మంచిశిక్షణ పొందిన ఆంగ్ల ఉపాధ్యాయులను ఇవ్వమని అడగాలి. పైగా తెలుగులో చదువుకుంటేనే శాస్త్రాలు సులభంగా బోధపడి, ఎవరైనా అభివృద్ధిలోకి రాగలుగుతారు. ప్రభుత్వ బడుల్లోనే కాదు- అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధన సాగాలని భాషావాదులు కోరుకుంటున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 1918లో నిజాం ప్రారంభించారు. విద్యాబోధన అంతా ఉర్దూ మాధ్యమంలో జరిగేలా నిర్దేశించారు. దేశంలో తొలిసారిగా ఓ భారతీయ భాష విద్యాబోధన మాధ్యమంగా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం చాలా మెచ్చుకోదగిన అంశమంటూ విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అప్పట్లో ఉత్తరం రాశారు. వందేళ్ల క్రితమే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి సాంకేతిక విద్యను, ఉన్నత విద్యను ఉర్దూ మాధ్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అందించింది. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి లాంటి వారు ఉర్దూలోనే మెడిసిన్‌ చదువుకున్నారు. స్వాతంత్య్రానంతరమే ఇక్కడ మీడియం మారింది. 1970 దశకం నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో పాఠ్యగ్రంథాలు తయారు చేయించి బోధించారు. కొన్ని సామాజిక శాస్త్రాల్లో పీజీ పుస్తకాల్నీ తెలుగులో రాయించారు. ఈ పని అంతా తెలుగు అకాడమీ చేసింది. నాడు కేంద్రమంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావు ముందుచూపువల్లే తెలుగు అకాడమీ ఏర్పాటు, తెలుగు మాధ్యమం అమలు సాధ్యమయ్యాయి. విద్యారంగంలో ప్రైవేటు వ్యాపారం పుంజుకొన్న దరిమిలా ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా విజ్ఞత చూపించి నిజమైన అభివృద్ధి సొంత భాష ద్వారా సాధ్యమనే విషయాన్ని ప్రజలకు గట్టిగా తెలియజెప్పాలి.

తెలుగులోనే ప్రభుత్వ పాలన వ్యవహారాలు జరగడానికి అంటే అధికార భాష అమలుకు ఉద్యోగాలకు, తెలుగు మాధ్యమానికి విడదీయలేని సంబంధం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదమూడు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఇంకా పెరగవచ్చు. వీరందరూ తెలుగువారి కోసమే పనిచేయాలి. పరిపాలన అంతా తెలుగులో ఉంటే ఈ ఉద్యోగులు అందరూ తెలుగులోనే ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పదమూడు లక్షల మందికీ తెలుగు మాధ్యమమే అవసరం. ఆంగ్ల మాధ్యమంతో పనిలేదు. అయినా ఒక పాఠ్యాంశంగా ఇంగ్లిష్‌ ఉంటుంది కాబట్టి ఆ పరిజ్ఞానం సరిపోతుంది. తెలుగువారందరికీ వారి ప్రభుత్వ కార్యకలాపాలు మాతృభాషలోనే జరుపుకోవడం వారికి సంక్రమించిన హక్కు. గ్రామంలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయం తనకు తెలియని భాషలో ఎందుకు పనిచేయాలి? ప్రతి పౌరుడూ ప్రభుత్వం తన మాతృభాషలో పనిచేయాలని కోరుకోవడం అతడికి ఉన్న హక్కు. దీన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. దీన్ని విస్మరించి ఆంగ్లంలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఫలానా వర్గాలవారి అభివృద్ధికి ఆటంకమని భావించడమూ సరికాదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార భాషగా తెలుగును అన్ని స్థాయుల్లో అమలు చేయాలి. తెలుగు మాధ్యమంలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పగలగాలి.అలాకాదు- మేము ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తామనేవాళ్లు ఆంగ్లభాషలో మరింత నైపుణ్యం సంపాదించుకోవచ్చు. కేంద్రప్రభుత్వం సరికొత్తగా రూపొందిస్తున్న విద్యావిధానంలో బోధన అంతా మాతృ భాషలో సాగాలని చెప్పింది. దీన్ని ఒక చట్టంగా తప్పనిసరిగా దేశమంతా అమలయ్యేలా చేయవలసిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యవరకైనా తెలుగు మాధ్యమం ఉండాలి.

వికాసంలో వెనుకబాటు

రాజకీయ నాయకులు మామూలు సందర్భాల్లో కాని లేదా ఎన్నికల ప్రచారంలో కాని ఆయా ప్రాంతాల భాష యాసల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? జాతీయ స్థాయి నాయకులు వేరే రాష్ట్రాల్లో హిందీలో మాట్లాడి, దాన్ని మరొకరితో అనువాదం చేయిస్తున్నారు. ఎందుకు? తాము చెప్పదలచుకున్నది సూటిగా ప్రజలకు చేరాలనే కదా! ప్రజల భాషతో అధికారంలోనికి వచ్చినవారు అదే భాషలో చదువు చెబితే ప్రజలకు తేలిగ్గా మనసుకు హత్తుకునేలా చెప్పవచ్చు- అనే ప్రాథమిక విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు. బాగా అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలు కొన్ని వారి మాతృభాషలో విద్యాబోధన చేస్తుండగా దాన్ని మనం ఎందుకు గ్రహించడంలేదు? తెలుగు భాషకు అత్యంత అధికంగా ఉత్పాదక శక్తి ఉంది. ఎన్నో పారిభాషిక పదాలు సిద్ధంగా ఉన్నాయి. పారిభాషిక పద నిఘంటువుల్నీ తయారు చేసింది తెలుగు అకాడమీ. ఉర్దూ వంటి తక్కువమంది మాట్లాడే భాషలోనే శతాబ్దం క్రితమే ఇంజినీరింగ్‌, వైద్య విద్యలను బోధించగలిగితే, తెలుగులో ఎందుకు చెప్పలేమని మనవారు ఆలోచించడం లేదు. కర్ణాటకలో పీజీ వరకు కన్నడ మాధ్యమం ఉంది. తమిళులు మరింత ముందుకెళ్లి హైకోర్టు తీర్పులు కూడా తమిళంలో ఉండాలని పట్టుబడుతున్నారు. కేరళలో మాతృభాషలోనే విద్యాబోధన ఉంది. మన తెలుగువారికే ఈ దుస్థితి ఎందుకు?

ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష 40 సంవత్సరాల్లో నశించిపోతుందని యునెస్కో అధ్యయనం శాస్త్రీయంగా చాటిన విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఇంగ్లీషు మీడియం విద్యను ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో తెలుగు కేవల ‘మౌఖిక భాష’గా మిగిలిపోతుంది. చదవడం, రాయడం చేతకాని జాతిగా మిగిలిపోతుంది. పక్క రాష్ట్రాలవారు భాషా వికాసంలో ముందుకెళ్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అతిదీనంగా ఉండటం మన దురదృష్టం. ఈ స్థితిలో భాషను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది!

(రచయిత- ఆచార్య పులికొండ సుబ్బా చారి

, విశ్రాంత ఆచార్యులు, ద్రవిడ విశ్వవిద్యాలయం)

ABOUT THE AUTHOR

...view details