భారత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో రేపు చర్చ జరగనుంది. ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై బుధవారం చర్చ చేపట్టి గురువారం ఓటింగ్ జరపనున్నారు. ఈ చట్టం దేశ పౌరసత్వ అంశంలో ప్రమాదకర మార్పును సూచిస్తుందన్న ఈయూ పార్లమెంట్ సభ్యులు... ఆందోళనలు చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని తీర్మానంలో పేర్కొన్నారు.
ఖండించిన ఉపరాష్ట్రపతి
ఈయూ పార్లమెంట్ తీరును కేంద్రం తప్పుబట్టింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన చట్టసభల అధికారాలను ప్రశ్నించే చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. సీఏఏ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పింది. భారత అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులుంటే భారత్ సొంతంగా పరిష్కరించుకోగలదని స్పందించారు. భారత పార్లమెంట్, ప్రభుత్వ పరిధిలోని అంశాలపై విదేశాలు జోక్యం చేసుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అటు తీర్మానాల అంశంపై ఈయూ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ మారియా సస్సోలీకి లోక్సభ స్పీకర్ ఓంబిర్లా లేఖ రాశారు. ఒక చట్టసభ, మరో చట్టసభ చేసిన అంశాలపై తీర్పులు చెప్పడం సరికాదన్నారు.