తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై పోరులో భారత్​కు ఐరోపా సమాఖ్య అండ'

జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భారత్ అంతర్గత విషయమని ఐరోపా సమాఖ్య(ఈయూ) ఎంపీల బృందం స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో రెండో రోజు పర్యటించింది ఈయూ బృందం. అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.

JK-EU-VISIT

By

Published : Oct 30, 2019, 2:03 PM IST

Updated : Oct 30, 2019, 3:37 PM IST

'ఉగ్రవాదంపై పోరులో భారత్​కు ఐరోపా సమాఖ్య అండ'

జమ్ము కశ్మీర్​ అంశం పూర్తిగా భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేసింది ఈయూ ఎంపీల బృందం. జమ్ముకశ్మీర్‌ సమస్యకు, ఉగ్రవాదానికి సంబంధం ఉందని అభిప్రాయపడింది. అక్కడి పరిస్థితులు తమకు పూర్తిగా అర్థమయ్యాయని వెల్లడించింది.

కశ్మీర్​ లోయలో రెండు రోజుల పర్యటనపై శ్రీనగర్​లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈయూ నేతలు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన కుల్గాం ఉగ్రదాడిని ఖండించారు.

"పర్యటనలో పరిశీలించిన దానిపై మాలోనే వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులను చాలా బాగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాం. ఉగ్రవాదంపై భారత్​ పోరును కూడా అర్థం చేసుకున్నాం. జమ్ముకశ్మీర్‌ ప్రమాదంలో ఉంది. మంగళవారం రాత్రి కూడా ఉగ్రవాదుల చేతిలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య. ఇది ఏ ఒక్క దేశానిదో.. లేక ఒక దేశ అంతర్గత సమస్య కాదు."

- హెన్రీ మేలోస్​, ఎంఈపీ, ఫ్రాన్స్​

భారత్​ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ పర్యటన చేపట్టలేదని మరో ఎంపీ థియర్రీ మారియాని స్పష్టం చేశారు.

"ఉగ్రవాదమనేది వెంటనే అంతరించిపోదు. ఒక్కోసారి సమస్యలు అందరికీ వర్తిస్తాయి. ఇందులో జోక్యమేమీ లేదు. కశ్మీర్​ అనేది మీ సమస్య. ఉగ్రవాదం అనేది మనందరి సమస్య. అందుకే మేం ఇక్కడికి వచ్చాం."

- థియర్రీ మారియాని, ఎంఈపీ

జర్మనీకి చెందిన మరో ఐరోపా ఎంపీ నికోలస్ ఫెస్ట్​ భిన్నంగా స్పందించారు. తమకు అవకాశం కల్పించినట్లే భారత్​లోని విపక్ష పార్టీలకూ కశ్మీర్​ పర్యటించేందుకు అనుమతించాలని కోరారు.

"కశ్మీర్​లో పర్యటించేందుకు ఐరోపా ఎంపీలకు అనుమతించారు. అలాగే భారత్​లోని విపక్ష రాజకీయనేతలకు ఇవ్వాలి. అక్కడేదైనా సమస్య ఉన్నట్లయితే ప్రభుత్వం వాటిని పరిష్కరించాల్సి వస్తుంది."

- నికోలస్ ఫెస్ట్​, ఎంఈపీ, జర్మనీ

ఇదీ చూడండి: ఘర్షణలతో ఐరోపా ఎంపీలకు 'కశ్మీర్​' స్వాగతం

Last Updated : Oct 30, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details