వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్' కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. మూడు రోజులుగా రవాణా వ్యవస్థ స్తంభించింది. పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. సొంత గూటికి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజస్థాన్ జైపుర్‌లో రెండు ట్రక్కుల్లో 150మందికి పైగా ప్రయాణిస్తుండగా ఈటీవీ భారత్ ప్రతినిధి గమనించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతమంది ఎలా ప్రయాణిస్తున్నారో తెలుసుకునేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రయత్నించారు.
రెండు రోజులుగా తిండిలేక
ట్రక్కులో ఉన్నవారిని వివరాలు అడగగా వారంతా పనికోసం గుజరాత్ వలసవెళ్లారని, ఉత్తర్‌ప్రదేశ్‌లోని భరత్‌పుర్, దౌలాపుర్, ఆగ్రా, మధురకు ప్రాంతాలకు చెందినవారని తెలిసింది. లాక్డౌన్ సమయంలో ఉండడానికి ఆశ్రయం లేక సొంత ఊళ్లకు చేరుకునేందుకు రెండు ట్రక్కుల్లో పయనమయ్యారు. రెండు రోజులుగా తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తున్నట్లు ఈటీవీ భారత్ ప్రతినిధికి తెలిపి తమ గోడు వెళ్ళబోసుకున్నారు కూలీలు. వెంటనే స్పందించిన ఈటీవీ భారత్ బృందం పోలీసులకు, స్థానిక అధికారులకు విషయం తెలియజేసింది. 150మంది కూలీల ఆకలి తీర్చేందుకు ఆహారం, ట్యాంకర్లో నీటిని ఏర్పాటు చేసింది.
కూలీలందరు సామాజిక దూరం పాటించారు. ఆకలి తీర్చుకున్నారు. నీరు తాగారు. అనంతరం అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారందరినీ సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు. ఈటీవీ భారత్ బృందం తీసుకున్న చొరవను కూలీలు కొనియాడారు.