తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈటీవీ భారత్'​ చొరవతో మృతదేహాల తరలింపునకు చర్యలు - MHA

అబుధాబిలో మరణించిన ఉత్తరాఖండ్​కు చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని తిప్పిపంపడాన్ని వ్యతిరేకిస్తూ ఈటీవీ భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో కరోనా సోకి మరణించిన భారతీయుల మృతదేహాలను దేశానికి తీసురానున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భారత్​కు తరలించవచ్చని పేర్కొంది.

ETV Bharat Impact
ఈటీవీ భారత్

By

Published : Apr 26, 2020, 6:03 AM IST

Updated : Apr 26, 2020, 7:53 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విదేశాల్లో మరణించిన వారి మృతదేహాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి నిమిత్తం అబుధాబికి వెళ్లిన ఉత్తరాఖండ్​కు చెందిన కమలేశ్ భట్.. ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించాడు. అధికారుల కథనం ప్రకారం ఏప్రిల్ 23-24 మధ్య కమలేశ్ మృతదేహం సహా మరో మూడు మృతదేహాలను దిల్లీకి తీసుకొచ్చారు. అయితే అనుమతులు లేవన్న కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు పార్థీవదేహాలను తిరిగి పంపించేశారు.

దీనిపై కథనం ప్రచురించిన ఈటీవీ భారత్.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించింది. కమలేశ్​ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించడంలో వైఫల్యానికి సమధానమివ్వాలని కోరింది. అబుధాబిలోని భారత ఎంబసీ సరైన సహకారం అందించకపోవడాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మృతదేహాల తరలింపుపై కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవాన్ని తిప్పి పంపిన అధికారులు

మార్గదర్శకాలను పాటించి...

ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి మృతదేహాలను తీసుకురావచ్చని తెలిపింది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల(ఎస్​ఓపీ)ను తప్పనిసరిగా పాటించాలని విమానయాన అధికారులకు సూచించింది.

అయితే.. కొవిడ్-19 బాధితుల మృతదేహాలు లేదా శరీర అవశేషాలను భారత్​కు తీసుకురావడాన్ని సిఫార్సు చేయడం లేదని ఎస్​ఓపీలో వైద్యశాఖ పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా హోంశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

వీటి పరిశీలన తర్వాతే

కరోనాతో మరణించిన వారి శవాలను విమానాశ్రయానికి తీసుకువచ్చిన తర్వాత సంబంధిత ఎయిర్​పోర్ట్ వైద్యాధికారి పలు విధివిధానాలు పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ధ్రువీకరించిన కరోనా మృతులు, అనుమానిత కరోనా మృతుల డెత్ సర్టిఫికేట్లు సహా రవాణాకు అనుమతిస్తూ భారత దౌత్య కార్యాలయాలు జారీ చేసిన ఎన్​ఓసీ(నో అబ్జక్షన్ సర్టిఫికేట్ల)లను పరిశీలించాలని తెలిపింది. అనంతరం మృతదేహాలను దేశంలోకి అనుమతించాలని పేర్కొంది.

శవాలను జాగ్రత్తగా తరలించేలా విమానయాన సంస్థలకు పలు సూచనలు జారీ చేసింది హోంశాఖ. శరీర అవశేషాలను తరలించిన సిబ్బందిని 28 రోజులపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు తెలిపింది. అస్థికల నుంచి వైరస్ వ్యాప్తి ప్రమాదం లేనందున వాటిని కుటుంబసభ్యులకు అప్పజెప్పేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

Last Updated : Apr 26, 2020, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details