ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ పూర్ణానంద ఘాట్‌లో కమలేశ్ భట్ అంత్యక్రియలు ముగిశాయి. దేశం లాక్డౌన్లో ఉన్నందున కేవలం 8మంది కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతినిచ్చారు అధికారులు. కమలేశ్ తండ్రి, సోదరుడు విమలేశ్ భట్ సహా మరో ఆరుగురు అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఈటీవీ భారత్ సాయంతో...
ఉపాధి కోసం అబుధాబి వెళ్లి ఈనెల 17న గుండెపోటుతో మరణించిన ఉత్తరాఖండ్ తెహ్రీకి చెందిన కమలేశ్ భట్ మృతదేహం 'ఈటీవీ భారత్' చొరవతో పది రోజుల తర్వాత ఇల్లు చేరింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు.
కమలేశ్ మృతదేహం అబుధాబి నుంచి భారత్‌కు రావటం ఇది రెండోసారి. ఈనెల 23న మొదటిసారి అబుధాబి ఎతిహాడ్ విమానాశ్రయం నుంచి దిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది భట్ మృతదేహం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన లాక్డౌన్ నిబంధనల వల్ల ఎలాంటి ప్యాకేజీని స్వీకరించేందుకు అనుమతులు లేవని కార్గో సిబ్బంది స్పష్టం చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అప్పగించకుండా గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని వచ్చిన విమానంలోనే తిరిగి అబుధాబి పంపించారు.