తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదముద్ర వేసింది. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న వ్యవస్థలను ఉగ్రవాదుల కంటే ఒకడుగు ముందుంచడమే లక్ష్యమని చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు హోంమంత్రి అమిత్​షా. ప్రతిపాదిత నూతన చట్టం రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉందని విపక్షాలు ఆరోపించాయి.

'ఉగ్రవాదులకన్నా వ్యవస్థను ఒకడుగు ముందుంచటమే లక్ష్యం'

By

Published : Jul 24, 2019, 5:59 PM IST

లోక్​సభలో ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ప్రభుత్వ వ్యవస్థలను ఉగ్రవాదుల కంటే నాలుగు అడుగులు ముందు నిలిపే లక్ష్యంతోనే సవరణలు చేపడుతున్నట్లు స్పష్టంచేశారు హోంమంత్రి అమిత్​షా. ప్రతిపాదిత నూతన చట్టం ఏవిధంగానూ దుర్వినియోగం కాదని తేల్చిచెప్పారు షా.

యూపీఏ హయాంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సరైన విధంగా సవరణలు చేస్తే ఇప్పుడు చేయాల్సి వచ్చేది కాదన్నారు షా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చట్టాలు చేయాల్సి ఉంటుందన్నారు.

'ఉగ్రవాదులకన్నా వ్యవస్థను ఒకడుగు ముందుంచటమే లక్ష్యం'

"ఈ దేశంలో సామాజిక కార్యకర్తలు లోక కల్యాణం కోసం పనిచేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులకు ఎలాంటి ఆసక్తి లేదు. కానీ పట్టణ మావోయిజం పేరుతో పనిచేస్తున్న వారిపట్ల ఏ విధమైన దయ చూపించేది లేదు. వామపక్ష ఉగ్రవాదాన్ని ప్రారంభంలో ఒక సిద్ధాంతపరమైన ఆందోళనగా భావించేవారు. కానీ దేశంలో వేల సంఖ్యలో పౌరుల ప్రాణాలు తీసింది. సిద్ధాంతమనే ముసుగు ధరించి మావోయిజాన్ని వ్యాపించాలనుకుంటే ఎలాంటి ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ఓ చట్టాన్ని తీసుకురావాలనుకుంటోంది. ఈ సవరణ బిల్లు లక్ష్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే. ఈ బిల్లుపై పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా ఆలోచించాలి. ఉగ్రవాదుల కంటే ప్రభుత్వ వ్యవస్థలు నాలుగు అడుగులు ముందు ఉండటం లక్ష్యంగానే సర్కారు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వ్యవస్థలకు కోరలు లేని చట్టాన్ని ఇవ్వకూడదు. ఒక బలమైన చట్టాన్ని ఇవ్వాలి."

-అమిత్​షా, హోంమంత్రి

విపక్షాల విమర్శలు
అంతకుముందు... ప్రతిపాదిత బిల్లును పార్లమెంట్ స్థాయి సంఘం ముందు పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్థాయి సంఘం పరిశీలన అనంతరమే బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టాలని అన్నారు.

ప్రతిపాదిత నూతన చట్టం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఆయా ప్రాంతాల్లో విచారణ చేపట్టే అవకాశం కల్పిస్తుండటం ఆక్షేపణీయమన్నారు టీఎంసీ నేత మహువా మోయిత్రా. ఎన్​ఐఏ స్వతహాగా ఒక మబ్బు కింద ఉందని, రాజకీయ కక్షసాధింపు కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కేంద్రాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపాదిత చట్టం వల్ల అమాయక వ్యక్తులు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని బీఎస్​పీ సభ్యుడు ధనీశ్ అలీ ఆందోళన వ్యక్తంచేశారు.
నూతన ఉగ్రవాద వ్యతిరేక చట్టం బిల్లు రాష్ట్రాల హక్కులను హరించివేస్తుందని, సమాఖ్య వ్యవస్థకు విఘాతమని టీఆర్​ఎస్ సభ్యుడు వెంకటేశ్ నేత వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'ఆర్టీఐని 'కోరలు లేని పులి'ని చేయకండి'

ABOUT THE AUTHOR

...view details