2019 ప్రారంభంలో భారీగా ఉద్యోగ కల్పన జరిగినట్లు భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జనవరిలో మొత్తం 8 లక్షల 96 వేల ఉద్యోగాలొచ్చాయని, ఇది 17 నెలల గరిష్ఠమని తెలిపింది ఈపీఎఫ్ఓ.
ఒక్క జనవరి నెలలోనే భవిష్యనిధి ఖాతాలు పొందిన వారి శాతం గతేడాదితో పొలిస్తే 131 శాతం పెరిగిందని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 76 లక్షల 48 వేల మంది కొత్తగా ఖాతాలు తెరిచినట్లు ఈపీఎఫ్ఓ విడుదల చేసిన నివేదిక తెలిపింది.
మార్చి నెలలో భవిష్యనిధి పరిధి నుంచి నిష్క్రమించే వారి సంఖ్య అధికంగా ఉండే అవకాశముందని ఈపీఎఫ్ఓ సంస్థ అంచనా వేస్తోంది. 2018 మార్చిలోనూ 29,023 మంది ఉద్యోగులు తమ భవిష్య నిధి ఖాతాలను మూసివేశారు.
యువతీ,యువకులే అధికం
కొత్త సంవత్సరం యువతకు కలిసొచ్చిందని నివేదిక చూస్తే అర్థం అవుతుంది. అధికంగా ఉద్యోగాలు పొందిన వారిలో 25 ఏళ్ల లోపు యువతే ఎక్కువగా ఉన్నారు.
- 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు యువతీ, యువకులకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య - 2 లక్షల 44 వేలు
- 18-21 ఏళ్ల మధ్య వయసు యువతీ, యువకులకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య - 2 లక్షల 24 వేలు
భవిష్యనిధి ఖాతాలు దరఖాస్తు చేసుకున్న వారు, ఇప్పటికే ఖతాదారులుగా ఉన్నవారి సంఖ్యను అనుసరించి ఈ నివేదిక రూపొందించామని ఈపీఎఫ్ఓ తెలిపింది. అయితే ఇది తాత్కాలిక సమాచారమేని స్పష్టం చేసింది. ఉద్యోగుల వివరాల నమోదు అనేది నిత్యం జరిగే పక్రియ కాబట్టి నివేదికలో సంఖ్యలు కాలానుగుణంగా మారతాయని పేర్కొంది.
ఇదీ చూడండి:భారత్ జోరు తగ్గింది- వృద్ధి లెక్క మారింది: ఫిచ్