తెలంగాణ

telangana

'శబరిమల' వివాదమేంటి? సుప్రీం తీర్పు మారుతుందా?

అయోధ్య, శబరిమల... రెండూ అత్యంత సున్నితమైన కేసులు. దశాబ్దాల నాటి అయోధ్య కేసులో గతవారం చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసు వంతు. గుడిలోకి ఎవరైనా వెళ్లొచ్చన్న తీర్పును సుప్రీంకోర్టు మార్చుతుందా? ఈ కేసుకు ఎందుకు ఇంత ప్రాధాన్యం? ఇప్పటివరకు ఏం జరిగింది?

By

Published : Nov 14, 2019, 6:00 AM IST

Published : Nov 14, 2019, 6:00 AM IST

Updated : Nov 14, 2019, 7:21 AM IST

'శబరిమల' వివాదమేంటి? సుప్రీం తీర్పు మారుతుందా?

దేశంలోని పురాతన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప క్షేత్రం ఒకటి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కొండపై ఆలయాన్ని శతాబ్దాల క్రితమే నిర్మించారు. చుట్టూ 18 కొండల సమాహారంగా ఉండే ఈ దివ్యక్షేత్రం.. పెరియార్‌ టైగర్ రిజర్వులో భాగంగా ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన 3 శతాబ్దాల వరకూ అక్కడి చేరుకోవడం దుర్బేధ్యంగా ఉండేది.

12వ శతాబ్దంలో పందలం రాజవంశీకుడైన యువరాజు మణికందన్‌ ఆలయానికి వెళ్లే అసలు మార్గాన్ని కనుగొన్నారు. యువరాజు మణికందన్‌ను అయ్యప్ప అవతారంగా భావిస్తారు. అప్పటి నుంచి అయ్యప్ప ఆలయంలో.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగి, ప్రాశస్త్యం దేశవిదేశాలకు విస్తరించింది. శబరిగిరీశుడి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం సంవత్సరంలో 127 రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. 41రోజులు దీక్ష చేసే మాలధారులు మకర సంక్రాంతి రోజున స్వామి దివ్యజ్యోతిని దర్శించుకుంటారు.

కేరళ హైకోర్టు తీర్పు...

అయ‌్యప్ప బ్రహ్మచారి కనుక 10 నుంచి 50 ఏళ్ల మధ్య రుతుస్రావ వయసున్న మహిళలు ఆలయంలోకి అడుగుపెట్టరాదనేది అనాదిగా వస్తోన్న ఆచారం. ఆ సంప్రదాయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 1991 ఏప్రిల్‌ 5న తీర్పు వెలువరించింది.

2006లో ప్రముఖ జ్యోతిషుడు ఒకరు దేవప్రాసనం నిర్వహించి.. ఒకప్పుడు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారనేందుకు కొన్ని సంకేతాలు కనిపించినట్లు చెప్పారు. అదే ఏడాది ప్రముఖ కన్నడ నటి జయమాల... షూటింగ్‌లో భాగంగా 1987లో తాను శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, స్వామి విగ్రహాన్ని తాకి పూజలు చేశానని ప్రకటించారు. అప్పుడు తనకు 28 ఏళ్లని చెప్పారు. అప్పుడు ఆమె తీరుపైనా, ప్రధాన పూజారిపైనా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ప్రకటన చేసిన పదేళ్లకు...

కన్నడ నటి జయమాల ఆలయ ప్రవేశంపై ప్రకటన చేసిన పదేళ్లకు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. 2016లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోషియేషన్.. ఆ వ్యాజ్యం వేసింది. 2016 నవంబరులో మహిళలను ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుకూలంగా.. లెఫ్ట్​ ఫ్రంట్​ ప్రభుత్వం సుప్రీంలో అఫడవిట్ దాఖలు చేసింది.

సంచలన తీర్పు...

పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు 2018 సెప్టెంబరు 28న.. రుతుస్రావంలో ఉన్న మహిళల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మహిళలను దేవతలని కీర్తిస్తూనే, వారిపై మతపరమైన ఆంక్షలు విధించడం ద్వంద్వ ప్రవృత్తి కిందకు వస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని తీర్పు ఇచ్చింది.

దద్దరిల్లిన కేరళ...

సుప్రీంకోర్టు తీర్పుపై శబరిమల ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, శబరిమల ఆలయ ప్రధాన పూజారి సహా హిందూ సంస్థలు, స్థానిక గిరిజన తెగలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేరళలోని లెఫ్ట్‌ ఫ్రంట్ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై కేరళలో.. నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఆందోళనలు కాస్తా రాజకీయరంగు పులుముకునే సరికి పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. భాజపా, ఆర్​ఎస్​ఎస్​, వీహెచ్‌పీ ఆందోళనలు నిర్వహించగా... మత సంప్రదాయాలను గౌరవించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ససేమిరా...

2018 సెప్టెంబరు 28న దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించగా.. అక్టోబరు 17న శబరిమల ఆలయ తరపులు తెరుచుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయురాలు కవితా జగ్దలే, సామాజిక కార్యకర్త రెహాన ఫాతిమా.. అయ్యప్ప కొండపైకి బయలుదేరారు. హిందూ సంస్థల ప్రతినిథులు, స్థానికులు వారిపైకి రాళ్లు రువ్వి, అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరు మహిళలకు పటిష్ఠ భద్రత కల్పించారు. మహిళలు ఆలయంలోకి వస్తే.. తలుపులు మూసేసి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు స్పష్టం చేయటం వల్ల పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చేసేదిలేక ఆ మహిళలు వెనుదిరిగారు.

ప్రభుత్వ చర్యలు...

సుప్రీంకోర్టు తీర్పుపై భాజపా, ఆర్​ఎస్​ఎస్​ ఆందోళనలను తిప్పికొట్టేందుకు కేరళ ప్రభుత్వం 620 కిలోమీటర్ల మేర 2019 జనవరి 1న మహిళలతో మానవ హారం ఏర్పాటు చేసింది. ‘మహిళా కుడ్యం' పేరుతో కాసారాగాడ్ ఉత్తర కొస నుంచి తిరువనంతపురం దక్షిణం చివరి వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో... 50 లక్షల మంది మహిళలు పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆ మరుసటి రోజు తెల్లవారుజామున అంటే జనవరి 2న.. 50 ఏళ్లలోపు వయసు గల ఇద్దరు మహిళలు స్వామిని దర్శించుకున్నారు. కేరళలోని పెరింతల్మన్న పట్టణానికి చెందిన 40 ఏళ్ల బిందు, కన్నౌర్‌కు చెందిన 39 ఏళ్ల కనకదుర్గ.. దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేశాకే భక్తులను దర్శనానికి అనుమతించారు.

దాడి...

స్వామిని దర్శించుకున్నందుకు కనకదుర్గపై.. ఆమె అత్త దాడి చేశారు. కర్రతో కొట్టగా కనకదుర్గ తలకు బలంగా గాయాలయ్యాయి. పోలీసులు కనకదుర్గను ఆస్పత్రికి తరలించి, ఆమె అత్తపై... కేసు నమోదు చేశారు. అనంతరం ఆలయ ప్రవేశం చేసిన ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా రుతుక్రమ వయసులో ఉన్న 51 మంది మహిళలు.. అయ్యప్పను దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది. బిందు, కనకదుర్గలకు 24 గంటలు భద్రత కల్పిస్తామని కోర్టుకు కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

64 పిటిషన్లు దాఖలు...

ఈ పరిణామాల నేపథ్యంలో హిందుత్వ సంస్థలు, అయ్యప్ప భక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మతాచారాలను గౌరవించాలని, రుతుస్రావం వయసున్న మహిళల ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ 64 పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం... ఈ ఏడాది ఫిబ్రవరి 6న విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే సమీక్ష పిటిషన్ దాఖలు చేసిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. తీర్పును... సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ తరఫున ఆరుగురు మహిళలు 2006లో సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. మహిళల ప్రవేశానికి అనుమతించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుపై మొదట తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు... తర్వాత మెత్తబడ్డారు. సనాతన సంప్రదాయాలను గౌరవించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గట్టిగా వాదించిన, ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సైతం ఆ తర్వాత తీర్పును గౌరవిస్తామంటూ ప్రకటించింది. అయితే.... వేలమంది అయ్యప్ప భక్తులు మాత్రం మహిళల ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ కేరళతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు

ఏ న్యాయమూర్తి ఏమన్నారంటే..

తప్పనిసరి మతాచారం కాదు

" శబరిమలలో అనుసరిస్తున్న సంప్రదాయాన్ని ‘తప్పనిసరి మతాచారంగా పరిగణించలేం. మతమంటే జీవితాన్ని దైవంతో అనుసంధానం చేసే విధానం. దైవారాధనలో వివక్ష ఉండకూడదు. ఆరాధనలో పాటించాల్సిన సమానత్వంపై పితృస్వామ్య వ్యవస్థ భావజాలం పైచేయి సాధించకూడదు.(జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌ తరఫున జస్టిస్‌ దీపక్‌మిశ్రానే తీర్పు రాశారు)."
- జస్టిస్‌ దీపక్‌మిశ్రా

ఆ నిబంధన కొట్టివేయ తగినది

"ఆలయంలోకి 10-50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళల్ని అనుమతించకూడదన్న సంప్రదాయం రాజ్యాంగంలోని అధికరణలు 25(1), 26లకు విరుద్ధంగా ఉంది. మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తున్న కేరళ హిందూ ప్రార్థనా స్థలాల(ప్రవేశాలకు అనుమతి) నిబంధనలు-1965లోని రూల్‌-3(బి) కొట్టివేయ తగినది."
- జస్టిస్‌ నారిమన్‌

వారిది ప్రత్యేక శాఖేమీ కాదు

"మహిళలకు ఆరాధన హక్కును నిరోధించడానికి మతాన్ని ముసుగుగా ఉపయోగించకూడదు. మతానికి సంబంధం లేని కారణాలతో శతాబ్దాల తరబడి మహిళలపై నిషేధం కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి భక్తులది హిందూ మతమే. ప్రత్యేకమైన మత శాఖ ఏమీ కాదు. శారీరక పరిస్థితిని కారణంగా చూపి, మహిళల గౌరవాన్ని భంగపరుస్తూ ఉండే ఎలాంటి మతపరమైన సంప్రదాయమైనా రాజ్యాంగ వ్యతిరేకమే. ఇది మహిళల స్వేచ్ఛ, సమానత్వం, గౌరవాన్ని హరిస్తోంది."
- జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

మత విశ్వాసాల్లో జోక్యం తగదు

" దేశంలో లౌకిక వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్థాలున్న మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సతీ సహగమనంలాంటి సాంఘిక దురాచారాలను తప్పిస్తే ఎలాంటి సంప్రదాయాలను కొట్టివేయవచ్చో... చెప్పాల్సిన పని న్యాయస్థానాలది కాదు. ఇక్కడ మహిళల సమానత్వ హక్కుకు, అయ్యప్ప భక్తుల ప్రార్థనా హక్కులకు మధ్య వివాదం తలెత్తింది. ఈ సమస్య ఒక్క శబరిమలతో ఆగదు. ఇతర ప్రార్థనా స్థలాలపైనా ప్రభావం చూపుతుంది. మతపరమైన వ్యవహారాల్లో హేతువాదాన్ని తీసుకురాకూడదు. భారతదేశం విభిన్న మతాచారాలకు నిలయం. రాజ్యాంగం ప్రకారం తాము నమ్మిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయిన ఆరాధించే హక్కును తోసిపుచ్చడానికి వీల్లేదు."
- జస్టిస్‌ ఇందూ మల్హోత్రా

ఇదీ చూడండి:ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు..!

Last Updated : Nov 14, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details