మరో ఆరు నెలలపాటు నాగాలాండ్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ముందస్తు వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.
కొన్ని దశాబ్దాలుగా నాగాలాండ్‌లో ఏఎఫ్ఎస్పీఏ కొనసాగుతోంది. తాజా ప్రకటనతో డిసెంబర్ 30 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ చట్టం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాగాలాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలు జరుగుతున్నందున కల్లోల ప్రాంతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని నాగాలాండ్‌లోని వివిధ వేర్పాటువాద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.