'జమ్ము కశ్మీర్... ప్రత్యేక హోదా రద్దు' పూర్తిగా తమ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశంలో ఎటువంటి వివాదం లేదని, ఇతర దేశాలు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. చర్చలు ప్రారంభించడానికి ముందు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపాలని గట్టిగా చెప్పింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రత మండలి రహస్య సమావేశం ముగిసిన నేపథ్యంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
పాకిస్థాన్, చైనా అభ్యర్థన మేరకు ఐరాస భద్రత మండలి అనధికార రహస్య సమావేశం నిర్వహించింది. అయితే సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.
"ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయం. ఇందులో ఇతర దేశాలకు ఎలాంటి సంబంధం లేదు. "
"కశ్మీర్ విషయంలో భారత చర్యలను... ఐరాస భద్రత మండలి రహస్య సమావేశం అంగీకరించింది. ఇది సంతోషకరం."_ సయ్యద్ అక్బరుద్దీన్, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
ఐరాస భద్రత మండలి అనధికార రహస్య సమావేశం ముగిసిన నేపథ్యంలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. చైనా, పాకిస్థాన్ రాయబారులు మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం గమనార్హం.