తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరికొత్త 'కశ్మీరం'.. చరిత్రలో నూతన శకం - రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కశ్మీర్​

జమ్ముకశ్మీర్‌ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభమైంది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లు ఆగస్టు 5న పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో అర్ధరాత్రి జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఒకే దేశం... ఒకే రాజ్యాంగం ప్రక్రియ అమల్లోకి వచ్చింది. లద్దాఖ్‌ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌ లేహ్‌లో ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌ చంద్ర ముర్ము మధ్యాహ్నం ప్రమాణం చేస్తారు.

సరికొత్త 'కశ్మీరం'.. చరిత్రలో నూతన శకం

By

Published : Oct 31, 2019, 8:24 AM IST

Updated : Oct 31, 2019, 12:29 PM IST

సరికొత్త 'కశ్మీరం'.. చరిత్రలో నూతన శకం

జమ్ముకశ్మీర్‌లో నేటి నుంచి నూతన అధ్యాయం ప్రారంభమైంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించింది. అవిభక్త జమ్ముకశ్మీర్​లో విధించిన రాష్ట్రపతి పాలనను గురువారం ఎత్తివేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కార్యాలయం నుంచి అధికారిక నోటిఫికేషన్​ జారీ అయింది.

28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారత చిత్రపటం సరికొత్తగా రూపుదిద్దుకుంది. దేశ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. లేహ్‌లో లద్దాఖ్‌ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌తో.. జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్ ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీనగర్‌లో జమ్ముకశ్మీర్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌చంద్ర ముర్ముతో ఈ రోజు మధ్యాహ్నం ఆమె ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

లద్ధాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ రాధాకృష్ణ మాథుర్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.... నేతలెవరూ పాల్గొనలేదు. దేశం మొత్తం ఒక్కటే అనే సంకేతాన్ని పంపేందుకే... శ్రీనగర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు.. ఓ అధికారి వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో.. లెఫ్టినెంట్‌ గవర్నర్లకు అధికారాలు ఉంటాయి. విభజన తర్వాత ఐఏఎస్​, ఐపీఎస్​, కేంద్ర విధుల్లో ఉన్న అధికారులు గతంలో ఉన్న పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లలో ఎక్కడైనా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం ఉందని.... ఉద్యోగుల బదిలీ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయిస్తారని అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జారీ చేసే బదిలీ ఉత్తర్వులను సమీక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

నిన్నటి వరకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశం ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో 'నవ భారతం'గా రూపుదిద్దుకుంది.

Last Updated : Oct 31, 2019, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details