మెదడువాపు వ్యాధితో చిన్నారులు మరణిస్తుండడంపై కేంద్రం సహా బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో 100 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. అనేక మంది చికిత్స పొందుతున్నారు. పిల్లల మరణాలతో ఆవేదన చెందిన మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నేడు విచారించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పోషకాహార పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏడు రోజుల గడువు విధించింది.