సామాన్యులకు రూ.కోట్ల విద్యుత్ బిల్లులు పంపిన ఉదంతాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. సింగ్రౌలీ జిల్లా బైఢన్ గ్రామంలో ఓ వినియోగదారునికి ఏకంగా భారత జీడీపీలో దాదాపు మూడోవంతు అంటే రూ.80 లక్షల కోట్ల బిల్లును వడ్డించింది.
సామాన్యుడికి 'కరెంట్' షాక్.. బిల్లు రూ.80 లక్షల కోట్లు!
వేలల్లో విద్యుత్ బిల్లులు వస్తేనే సామాన్యులు భరించలేరు. అలాంటిది మధ్యప్రదేశ్లో ఓ గ్రామీణ వినియోగదారునికి ఏకంగా రూ.80 లక్షల కోట్ల విద్యుత్ బిల్లును వడ్డించింది రాష్ట్ర విద్యుత్ శాఖ. బిల్లును చూసి షాక్ అయిన బాధితుడు అధికారులను సంప్రదించగా.. ఎవరూ స్పందించటం లేదని వాపోయాడు.
బిల్లును చూసి షాక్కు గురైన ఇంటి యజమాని విద్యుత్ సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ స్థాయిలో బిల్లు రావటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిని సవరించి సరైన బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారని వాపోయాడు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని ఎగతాళి చేస్తున్నారు ప్రజలు. లాక్డౌన్లో ప్రజలకు విద్యుత్ బిల్లులలో ఉపశమనం ఇస్తామని, 50 నుంచి 100 రూపాయల మేర వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు విరుద్ధంగా విద్యుత్ శాఖ కృషిచేస్తోందని విమర్శలు వస్తున్నాయి.