కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు... దేశ విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకురానుంది. విద్యుత్ రుసుముల నిర్ణయాధికారంతో పాటు ఒప్పందాలపైనా కేంద్ర ప్రభుత్వానిదే అంతిమ అధికారం కానుంది.
రాష్ట్రాలు అనుసరిస్తున్న రాయితీల విధానం కారణంగా విద్యుత్ సరఫరా సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల రాయితీ విధానాలను సమీక్షించే అధికారాన్ని పొందేందుకు కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది.
వ్యతిరేకిస్తున్న తమిళ సర్కార్
ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020ని పలు రాష్ట్రాలు సహా కేంద్రంతో సఖ్యంగా ఉన్న తమిళ సర్కారు కూడా వ్యతిరేకిస్తోంది. అయితే కేంద్ర విద్యుత్ శాఖ మాజీ కార్యదర్శి ఉమాశంకర్, ప్రముఖ ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి తదితరులు మాత్రం తాజా విద్యుత్ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్నారు.
అస్మదీయులకే చోటు..
విద్యుత్ రంగంలోని కీలకమైన విద్యుత్ నియంత్రణ కమిటీల్లో, అప్పీలేట్లలో కేంద్రం ప్రతిపాదించిన వారే సభ్యులుగా ఉండేలా బిల్లులో పొందుపరిచారు. ఈ విధానం రాష్ట్రాలకు ఇబ్బందికరమైనా మొత్తం వ్యవస్థకు మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు.
"విద్యుత్ సవరణ బిల్లును రాష్ట్రాలు వ్యతిరేకించడం సమంజసమే. అయితే విద్యుత్ నియంత్రణ కమిషన్లలో సభ్యులను నియమించకుండా వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చిన పాపం రాష్ట్రాలదే. కొత్త విధానంతో ఆ పరిస్థితి మారుతుంది"
- ఉమాశంకర్, విద్యుత్ శాఖ మాజీ కార్యదర్శి
విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో రాష్ట్రాల పరిధిలోని కమిటీలు.... ప్రభుత్వ యంత్రాంగం వైపు చూడాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉందని ఉమాశంకర్ అన్నారు. అందుకే ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాల పరిధిని కుదించడం సబబేనని ఆయన అభిప్రాయపడ్డారు.
"కొత్త బిల్లులో పొందుపరిచిన దాని ప్రకారం... సమయానికి రెగ్యులేటరీ సభ్యుల నియామకం జరుగుతుంది. ఆ సభ్యులు ఎటువంటి పక్షపాతం కూడా లేకుండా పనిచేయడానికి వీలవుతుంది. ఫలితంగా విద్యుత్ రుసుమల సమీక్షలో పక్షపాత ధోరణి తగ్గుతుంది."
- ఉమాశంకర్, విద్యుత్ శాఖ మాజీ కార్యదర్శి
స్తంభించిపోయే ప్రమాదముంది..!
ఈ బిల్లులో పొందుపరిచిన సెక్షన్ 78 ప్రకారం.. అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో సభ్యులను ప్రతిపాదించడం సహా కేంద్ర, రాష్ట్రాల కమిషన్‌లు, సంయుక్త కమిషన్‌లలో సభ్యులను సెలక్షన్ కమిటీ సూచిస్తుంది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీలో... ఓ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉంటారు. ఆయన/ఆమె పేరును భారత ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదిస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు కార్యదర్శి స్థాయి అధికారులు, 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
అయితే ఒక కమిటీ చేతుల్లోనే అధికారం మొత్తం కేంద్రీకృతం కావడం వల్ల వ్యవస్థలు స్తంభించి పోయే ప్రమాదం కూడా ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు.
సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే..
న్యాయమూర్తుల నియామకంలోనూ వివాదాలు వస్తున్న ఇలాంటి తరుణంలో... సెలక్షన్ కమిటీ కూడా అందుకు అతీతం ఏమీ కాదని జస్టిస్ లోకూర్ అన్నారు. అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సరైన విధానాన్ని ప్రకటించాలని ఆయన సూచించారు.
సెలక్షన్ కమిటీ ఆదేశాలు ఎల్లప్పుడూ పాటించాలా లేదా... ఒక వేళ వాటిని తిరస్కరించాల్సి వస్తే అందుకు ఆధారాలు ఏముండాలా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కూడా జస్టిస్ లోకూర్ అన్నారు.
కొత్తగా.. నియంత్రణ సంస్థ
ఈ బిల్లులోని మరో ప్రధాన అంశం... విద్యుత్ రంగంలో ఒప్పందాలకు సంబంధించి ఓ నియంత్రణ సంస్థను తీసుకురావడం. అయితే ఈ విధానాన్ని ఉమాశంకర్ లాంటి వారు వ్యతిరేకిస్తున్నారు. ఓ నియంత్రణ సంస్థపై మరో నియంత్రణ సంస్థ వల్ల సంక్లిష్టతలు నెలకొంటాయని ఆయన అంటున్నారు. ఒకవేళ ఒప్పందాల అంశాల్లో సమస్యలుంటే ఈ బిల్లు ద్వారా పరిష్కారం చూపాలి కానీ... కొత్త నియంత్రణ సంస్థలతో ఉపయోగం ఉండదని ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు.
పక్కన పెట్టండి..
రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీల విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ఈ బిల్లును కొంత కాలం పక్కన పెట్టాలని తమిళనాడు సీం పళనిస్వామి సైతం ప్రధానికి లేఖ రాశారు. దీనిపై మరిన్ని సంప్రదింపులు అవసరం అని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేశామని కానీ కొత్త బిల్లు కారణంగా ఆ హామీ అమలు చేయలేమని చెప్పారు.
ఇక 'ఉచితం' కుదరదు...
ఈ బిల్లు రాష్ట్రాలు... విద్యుత్ రాయితీలు ఇవ్వకుండా అడ్డుకోలేదని ఉమాశంకర్ స్పష్టం చేశారు. అయితే ఉచిత కరెంటు మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్పారు. 'విద్యుత్ ధరలు నిర్ణయించేటప్పుడు ఆ రాయితీలను కేంద్రం పరిశీలనలోకి తీసుకోదు. ఒకవేళ రాష్ట్రాలు రాయితీలు ఇవ్వాలని అనుకుంటే అందుకు సమస్యేమీ ఉత్పన్నం కాదు' అని ఉమాశంకర్ చెప్పారు.
విద్యుత్ సరఫరా సంస్థల నుంచి విద్యుత్ తీసుకుంటూ... వాటికి రూపాయి కూడా చెల్లించకుండా ఉండడం మంచి పద్ధతి కాదని కేంద్ర విద్యుత్ శాఖ మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి అభిప్రాయపడ్డారు.
మరిన్ని వివాదాలు...
సంప్రదాయేతర విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ అనేక వివాదాలు ఉన్నాయి. పునరుత్పాదక ఇంధనాల వైపు వెళ్లాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంటే... రాష్ట్రాలు మాత్రం వాటి వల్ల తమ ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నాయి. అయితే రాష్ట్రాల అభిప్రాయాలను మోహన్ గురుస్వామి తప్పుపట్టారు.
పునరుత్పాదక ఇంధనాల ధరలు అధికంగా ఉన్నప్పటికీ... అవి పర్యావరణానికి మేలు చేస్తాయని మోహన్ గురుస్వామి పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత మెరుగైన విధానాలతో... ఇరువురి మధ్య సంబంధాలు చెడకుండా సమర్థమైన చట్టాన్ని తేవాలని ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:అమెరికా చట్టసభలో చైనాపై ఆంక్షల బిల్లు