ఎన్నికల బాండ్లు... రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన సాధనాలు. అయితే, ఇవి రాజకీయ విరాళాల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కాదని, విపక్షాలకు నిధులు అందకుండా అడ్డుకునే ఉపకరణాలని కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో మరోసారి వీటిపై తీవ్రస్థాయి చర్చ మొదలైంది. గతంలో కంపెనీల లాభాల్లో 7.5 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే పద్ధతి ఉంది. ఫలితంగా, కంపెనీలు విభిన్న రాజకీయ పార్టీలకు విరాళమిచ్చేందుకు లెక్కల్లో చూపని ధనాన్ని పలు దొంగమార్గాల్లో ఉపయోగించేందుకు అవకాశం కల్పించిందనే విమర్శలున్నాయి.
అలాంటి లోపభూయిష్ఠ వ్యవస్థను సరిదిద్దాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2018, జనవరి రెండున ఎన్నికల బాండ్ల పద్ధతిని తీసుకొచ్చింది. అదే ఏడాది జనవరి 23న ఆదాయపన్ను విభాగం రాజకీయ పార్టీలకు నగదు రూపంలో ఇచ్చే విరాళాలు రెండు వేల రూపాయలకు మించకూడదంటూ ఆదేశించింది. ఇంతాచేసి, కొత్తగా తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు సైతం కార్పొరేట్ సంస్థలకు ఎన్నికల నిధులు అందించే విషయంలో పరిమితుల్ని తొలగించాయనే విమర్శలు లేకపోలేదు. భారీ వ్యాపార సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా, తమకు నచ్చిన పార్టీకి కావాల్సినంత ధనాన్ని బాండ్ల ద్వారా అందించే వీలుందనేది వీటిపై ఉన్న విమర్శ.
భేదాభీప్రాయాలు
ఎన్నికల బాండ్ల పథకం వివాదాల మధ్యే పురుడు పోసుకుంది. దీనిపై ప్రారంభంలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తాయి. ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో బాండ్లపై ప్రకటన చేసినప్పుడు నాటి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ 2017 సెప్టెంబర్ 14న రాసిన లేఖలో మూడు అంశాలను లేవనెత్తారు. ఎన్నికల బాండ్ల కొనుగోలులో కంపెనీలు తమ గుర్తింపు బయటపడకుండా దాచిపెట్టేందుకు మనుగడలో లేని డొల్ల కంపెనీలను ఉపయోగించుకుని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తాయని ఆయన ఆక్షేపించారు. ఇలా ఆర్థిక లావాదేవీల్లో డొల్ల కంపెనీలను ఉపయోగించడంవల్ల నిధుల అక్రమ తరలింపునకు సంబంధించిన ‘మనీలాండరింగ్’కు బాటలుపడతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల బాండ్లను తాత్కాలిక ధ్రువపత్రాల రూపంలో కాకుండా, డీమాట్/ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయడంవల్ల దాతల గోప్యతను మరింత సమర్థంగా పరిరక్షించవచ్చని సూచించారు. డీమాట్ పద్ధతిలో ఉండే సార్వత్రిక సంఖ్యను రాజకీయ పార్టీకి ఇస్తే సరిపోతుందన్నారు. డబ్బులు చెల్లించినవారి వివరాలు ఆర్‌బీఐ వద్ద, తీసుకున్న రాజకీయ పార్టీ వివరాలు ఎన్నికల సంఘం వద్ద ఉంటాయన్నారు. ఇలాంటి డీమాట్ విధానం ఎన్నికల విరాళాల్లో పూర్తిస్థాయి పారదర్శకతకు దారితీస్తుందని వివరించారు. రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్ 31, సర్వోన్నత బ్యాంకుగా బాండ్లు జారీ చేసే అధికారాన్ని ఆర్‌బీఐకే కల్పిస్తోందని తేల్చిచెప్పారు. సెక్షన్ 31కి సవరణ చేసి, భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)కి బాండ్లు జారీచేసే అనుమతి ఇస్తే, కేంద్రబ్యాంకుగా ఆర్‌బీఐకి ఉండే ఏకస్వామ్యాధికారానికి గండిపడుతుందని ఉర్జిత్ పటేల్ ఆ లేఖలో వాదించారు.
అయితే, ఎన్నికల బాండ్లను డీమాట్ రూపంలో జారీ చేస్తే, దాతల గుర్తింపును గోప్యంగా ఉంచాలనే వాస్తవిక లక్ష్యం విఫలమవుతుందని, వాటిని తాత్కాలిక ధ్రువపత్రాల రూపంలో జారీ చేయడమే మేలని నాటి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ 2017 అక్టోబర్ అయిదున రాసిన ప్రతిస్పందన లేఖలో బదులిచ్చారు. ఉర్జిత్ పటేల్ మళ్ళీ స్పందిస్తూ, బాండ్లను తాత్కాలిక ధ్రువపత్రాల రూపంలోనే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, వాటిని ఆర్‌బీఐ మాత్రమే జారీచేయాల్సి ఉంటుందని 2017 అక్టోబర్ 11న రాసిన లేఖలో స్పష్టీకరించారు. ప్రభుత్వం ఆ వాదననూ అంగీకరించలేదు. ఆర్‌బీఐ షెడ్యూల్డు బ్యాంకు విభాగంలోకి రాదని స్పష్టం చేసింది.
ఎలాగైతేనేం- ఆర్థికబిల్లు, 2017 ద్వారా ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 31కి సవరణ తీసుకొచ్చింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని పూర్తిస్థాయిలో ఎస్‌బీఐ ద్వారానే అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు, సదరు బాండ్లకు స్టాంపు డ్యూటీ ఉండాలన్న ఎస్‌బీఐ కోరికనూ ఆమోదించింది. ఫలితంగా, ఎస్‌బీఐకి నేరుగా ఆదాయం లభిస్తుంది. ఈ పరిణామాలన్నింటినిబట్టి చూస్తే, కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల విషయంలో ఆర్‌బీఐలో ఎంతోకొంత అసంతృప్తి ఉందని తెలుస్తోంది.
ఎవరు వాదనలు వారివే
ఎన్నికల బాండ్ల విషయంలో ఆర్థికశాఖ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు ఊతమిచ్చాయి. ఏటా పది రోజుల చొప్పున నాలుగు విడతలుగా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో ఎస్‌బీఐ ద్వారా బాండ్ల అమ్మకం జరుగుతుందని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అయితే, ఆర్థిక శాఖ రెండు వేర్వేరు సందర్భాల్లో నిర్దేశిత షెడ్యూలుకు సంబంధం లేకుండా బాండ్లను అమ్మేందుకు అవకాశం కల్పించడం విమర్శలకు దారితీసింది.
ఆ రెండు సందర్భాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా జారీ కావడంతో అదంతా యాదృచ్ఛికమని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. 2018 మే నెలలో కర్ణాటక ఎన్నికల ముందు, ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. సదరు బాండ్ల ద్వారా వచ్చే నిధుల్ని అసెంబ్లీ ఎన్నికల తరవాత విపక్ష ఎమ్మెల్యేలను చీల్చేందుకు ఉపయోగిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తరవాత తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా 2018 నవంబర్‌లో మరోసారి ప్రత్యేకంగా అవకాశం కల్పించారనే విమర్శలున్నాయి.