లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఇప్పటికే 6 దశలు పూర్తయ్యాయి. చివరిదైన ఏడో విడత ఓటింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వరుసక్రమంలో బారులుదీరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఏడో విడతలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
ఈసీ భద్రత నడుమ
పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. గత విడతల్లో అల్లర్లు చోటుచేసుకున్న బంగాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈసీ.