ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో తాత్కాలిక సభ్యదేశంగా....భారత్ మరోసారి ఎన్నిక కావటం లాంఛనంగా మారింది. ఐదు తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకునేందుకు.. జూన్ 17న ఎన్నికలు నిర్వహించాలని ఐరాస జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. ఆసియా- పసిఫిక్ నుంచి పోటీ చేస్తోన్న ఏకైక దేశమైన భారత్.. ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఖాయంగా కనిపిస్తుంది.
గత ఏడాది జూన్‌లోనే చైనా, పాకిస్థాన్ సహా ఆసియా-పసిఫిక్ కూటమి దేశాలు.. భారత్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనున్న భారత్.. ఇప్పటివరకూ ఏడుసార్లు ఎన్నికైంది. ఇదే సమయంలో ఐరాస ఆర్థిక, సామాజిక మండలికి సైతం తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోనున్నారు.