తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'సమరంలో ప్రచార రథాల పరుగులు

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు ప్రచారజోరును మరింత పెంచాయి. అధికార పీఠాన్ని నిలుపుకునేందుకు భాజపా తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా పలువురు ముఖ్యనేతలు ప్రచారాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్​ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ.. అధికారపార్టీయే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​. ఈ తరుణంలో ఎన్నికల్లో విజయఢంకా మోగించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోయేది ఎవరని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

'మహా'సమరంలో జోరుగా సాగుతున్న ప్రచార రథాలు

By

Published : Oct 14, 2019, 1:16 PM IST

ఎన్నికల సమరానికి వారం రోజులే మిగిలి ఉన్నందున మహారాష్ట్రలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల ప్రణాళికలు (మ్యానిఫెస్టోలు), హామీలతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కీలక నేతలంతా తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తదితర జాతీయ ప్రముఖులంతా రంగంలోకి దిగారు.

'మహా'సమరంలో జోరుగా సాగుతున్న ప్రచార రథాలు

మహారాష్ట్రలో అన్ని పార్టీలు 4 నెలల క్రితం నుంచే ప్రచారాన్ని ప్రారంభించాయి. మే నెలలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైపోయాయి. అనంతరం ప్రజల్లో ఉండేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ 'మహా జనదేశ్‌ యాత్ర'.. శివసేన నేత ఆదిత్య ఠాక్రే 'జన్‌ ఆశీర్వాద్‌ యాత్ర'... ఎన్‌సీపీ నేతలు 'శివ్‌ స్వరాజ్‌ యాత్ర'లు చేపట్టారు.

ప్రతిపక్షాలు డీలా..

ప్రచారంలో అధికార భాజపా-శివసేన కూటమిని వెనక్కి నెట్టేలా ప్రతిపక్ష కాంగ్రెస్‌ - నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లు దూసుకెళ్లలేకపోతున్నాయి. ప్రధాన సమస్యలను అస్త్రాలుగా మలచుకునే ప్రయత్నం చేయడంలో ఈ పార్టీలు విఫలమవుతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగానే ఉంది. ఉల్లి ఎగుమతులపై మోదీ ప్రభుత్వం నిషేధం విధించడం పట్ల.. రాష్ట్రంలో 80 శాతం ఉల్లిని ఉత్పత్తి చేస్తున్న ఉత్తర మహారాష్ట్ర రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రతిపక్షాలు డీలా..

కొల్హాపుర్‌, సతారా, సంగ్లీ వంటి పశ్చిమ ప్రాంత జిల్లాల్లో వరదలకు చెరకు, ఇతర పంటలు దెబ్బతిని రూ. వందల కోట్లలో నష్టం వాటిల్లింది. మరఠ్వాడా జిల్లాల్లో కరవు తాకిడి ఉంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అంత చురుగ్గా పనిచేయలేదన్న ఆవేదన రైతుల్లో ఉంది. అజిత్‌ పవార్‌, అశోక్‌ చవాన్‌ తదితర ప్రతిపక్ష నేతలు తమ ప్రచారంలో ఈ అంశాలను లేవనెత్తుతున్నప్పటికీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. గతంలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పాలన సాగించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నందున గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.

కాంగ్రెస్​లో నాయకత్వలోపం..

కాంగ్రెస్​లో నాయకత్వలోపం..

కాంగ్రెస్‌ పార్టీలో నడిపించేవారు కరవయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ చవాన్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌లు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. సుశీల్‌ కుమార్‌ షిండే తన కుమార్తె పోటీచేస్తున్న శోలాపుర్‌పై దృష్టిని కేంద్రీకరించారు. మరోవైపు ముంబయిలో సంజయ్‌ నిరుపమ్‌ బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేశారు. మిలింద్‌ దేవ్‌రా, ఏక్‌నాథ్‌ గైక్వాయిడ్‌ వంటి నేతలు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. సీనియర్‌ నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ శివసేన-భాజపాలో చేరినందున కాంగ్రెస్‌ కార్యకర్తల స్థైర్యం దెబ్బతింది.

శరద్​ పవార్​ ఒక్కరే..

శరద్​ పవార్​ ఒక్కరే..

ప్రతిపక్షాల ప్రచారంలో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఒక్కరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈడీ దర్యాప్తు జరుపుతున్న.. రాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆయన పేరు ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. ఆ బ్యాంకులో ఆయనకు సభ్యత్వం కూడా లేనందున వెంటనే ఆయన ఓ అడుగు ముందుకేసి ఈడీ ఎదుట తనంతతానుగా హాజరు కావడానికి సిద్ధమయ్యారు. ఈ చర్య ఈడీ అధికారులను, ఫడణవీస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రతిపక్ష నేతలపై భాజపా తప్పుడు కేసులు పెడుతూ, వేధిస్తుందనడానికి ఇదో ఉదాహరణ అంటూ పవార్‌ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా సానుభూతిని కూడగట్టడంలో ఆయన కొంత సఫలీకృతమయ్యారు. ప్రతిపక్షాల్లో ప్రధానంగా శరద్‌ పవార్‌ ఒక్కరే ప్రజలను ఆకర్షించగలిగే నేతగా మిగిలారు.

అధికార కూటమి దూకుడు..

అధికార కూటమి దూకుడు..

భాజపా-శివసేన కూటమి ప్రచారాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేలు ముందుండి నడిపిస్తున్నారు. ఫడణవీస్‌ నిర్విరామంగా రోజుకు ఆరేడు సభల్లో పాల్గొంటున్నారు. గతంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉద్ధవ్‌ కొంత నిదానంగా ప్రచారం చేస్తున్నారు. భాజపా కీలక ప్రచారకర్తలు ప్రధాని మోదీ, అమిత్‌ షాలు రంగంలోకి దిగి అధికార కూటమికి మరింత బలం చేకూరుస్తున్నారు. కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు, పాకిస్థాన్‌ తీరు తదితర అంశాలను మోదీ, అమిత్‌ షాలు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ అంశాలపై ప్రజలు చూపుతున్న సానుకూలతతో ప్రతిపక్షాలు పెద్దగా మాట్లాడలేకపోతున్నాయి.

అధికార కూటమి దూకుడు..

మ్యానిఫెస్టోలు..

కాంగ్రెస్‌-ఎన్‌సీపీల ప్రతిపక్ష కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను రూపొందించాయి. రైతులకు పూర్తి రుణమాఫీ, రూ. 21వేలు కనీస వేతనం, ప్రతి పేద కుటుంబానికి ఓ ఉద్యోగం వంటి హామీలిచ్చాయి. వీటిలో కొత్త విషయం గానీ, ప్రజలను ఒక్కసారిగా ఆకర్షించే అంశం గానీ లేవన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఆయా పార్టీల నేతలు తమ ప్రచారంలో కూడా వీటి గురించి అంతగా ప్రస్తావించడం లేదు.

అధికార పక్షం

భాజపా-శివసేన పొత్తుతో బరిలోకి దిగినప్పటికీ.. శివసేన ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇది భాజపాను భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రారంభించిన క్యాంటీన్లను దృష్టిలో పెట్టుకుని శివసేన పేదలకు రూ. 10కే మంచి భోజనం అని ప్రకటించింది. ఇలాంటివి తర్వాత అమలు చేయడం కొంత ఇబ్బందికరమన్న భావన వ్యక్తమవుతోంది. భాజపా ఇంతవరకు మ్యానిఫెస్టో విడుదల చేయలేదు. గత ఎన్నికల్లో కూడా మ్యానిఫెస్టో లేకుండానే ప్రచారం చేసి.. పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details