బిహార్‌లో ఈనెల 10న (మంగళవారం) నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎలక్షన్ కమిషన్(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలున్న తూర్పు చంపారన్, గయ, శివాన్, బేగుసరయి జిల్లాల్లో 4 చొప్పున లెక్కింపు కేంద్రాలు సిద్ధమయ్యాయి. మిగతా జిల్లాల్లో అవసరాన్ని బట్టి 1 లేదా 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిహార్‌లో అక్టోబరు 28, ఈనెల 3, 7 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఈమేరకు ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను (కేంద్ర సాయుధ పోలీసు దళం-సీఏపీఎఫ్, బిహార్ మిలటరీ పోలీస్, జిల్లా పోలీసులతో) ఏర్పాటు చేసినట్లు బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్.ఆర్.శ్రీనివాస తెలిపారు.
- ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరుస్తారు.
- ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రదర్శన తెరలను, 2 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పాత్రికేయులు, భద్రత సిబ్బంది కోసం కేటాయిస్తారు.
- ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 414 హాళ్లు సిద్ధం కాగా.. ఒక్కో హాల్‌కు 7 టేబుళ్లు ఉంటాయి.
ఫలితాలెలా ఉన్నా.. హుందాగా ఉండండి!