తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల నిర్వహణకు ఈసీ పక్కా ప్రణాళిక - bihar assembly election news

కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. జనజీవితాలను అస్తవ్యస్తం చేస్తోన్న ఈ అసాధారణ పరిస్థితుల్లో బిహార్​ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది ఎన్నికల సంఘం. నామినేషన్ల ఘట్టం మొదలు.. ప్రచారపర్వం, రోడ్‌షోలు, ర్యాలీల సందర్భంగా ఆచరించాల్సిన స్పష్టమైన విధివిధానాలు, బహిరంగ సభా ప్రాంగణాల్లోనూ కచ్చితంగా పాటించాల్సిన భౌతిక దూరం నిబంధనల్ని ఈసీ క్రోడీకరించింది. ఈ మేరకు ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా అడుగులువేస్తోంది.

Election Commission
కరోనా విపత్తు వేళ బిహార్​ ఎన్నికలకు ఈసీ అడుగులు

By

Published : Sep 8, 2020, 11:37 AM IST

మానవాళి మనుగడపైనే ప్రశ్నలు సంధించిన కరోనా మహమ్మారి... జనజీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ విలయంలో.. సాధారణ జీవనమే తలకిందులైపోతే.. బిహార్‌ ఎన్నికలు నిర్వహించాలనే ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఈ అసాధారణ సమయంలో.. సరికొత్త సాధారణానికి అనుగుణంగానే ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్‌ దాకా... పోలింగ్‌ బూత్‌లలో థర్మల్‌ స్కానర్లు మొదలు.. ఈవీఎంల వద్ద గ్లొవ్స్ వరకూ అన్నీ సరికొత్తగా ఆవిష్కృతం కానున్నాయి. కరోనా సమయంలో ఎన్నికల నేపథ్యంలో కొత్త నిబంధనావళి విడుదల చేసిన ఈసీ... ఆ మార్గదర్శకాలే మార్గంగా బిహార్‌ ఎన్నికల నిర్వహణకు అడుగులువేస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎన్నెన్నో చిత్రాలు..

ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి.. పోలింగ్‌ బూత్‌లలో థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఈవీఎం బటన్‌ నొక్కే ముందు ఓటర్లు గ్లొవ్స్‌ ధరించాలి. అంతేనా కేంద్రం విడుదల చేసిన కొవిడ్‌–19 కంటైయిన్‌మెంట్‌ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాలను రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాలి. అభ్యర్థుల నామినేషన్లు, డిపాజిట్లు అన్ని ఆన్‌లైన్‌లోనే. ఇక ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు, పీపీఈ కిట్ల వాడకం వంటి ప్రామాణిక రక్షణ చర్యలు తప్పనిసరి. కొవిడ్‌–19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఇవి కొన్ని. బిహార్‌ ఎన్నికల్లో ఈ చిత్రాలన్నీ ప్రత్యక్షంగా పలకరించబోతున్నాయి.

మార్గదర్శకాలే కీలకం..

కరోనా వైర‌స్ విజృంభిస్తున్న సమయంలో, దేశంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కీలకం కానున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలుచోట్ల ఉప ఎన్నికల నిర్వహణకు తాజా మార్గదర్శకాలు అమలు కానున్నాయి. నామినేషన్‌ దాఖలు, ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు తదితర సమయాల్లో కరోనా‌ వ్యాప్తి చెందకుండా ఈ ముందస్తు జాగ్రత్తలను సూచించినట్లు చెబుతోంది ఎన్నికల సంఘం. కంటైన్‌మెంట్‌ జోన్లలో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. ఒకవైపు, కరోనా మహమ్మారి ముప్పు మరింత తీవ్రం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈసీ నిబంధనలకు లోబడి బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. క్రితంసారి సెప్టెంబరు ఎనిమిదిన నోటిఫికేషన్‌ జారీతో మొదలుపెట్టి 5 విడతల ఎన్నికల్ని సజావుగా పూర్తి చేసింది ఈసీ.

ఆన్​లైన్​ ద్వారానే నామినేషన్​..

ప్రత్యేక నిబంధనల విషయానికొస్తే... నామినేషన్‌ దాఖలు, పత్రాల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటివి సజావుగా సాగేందుకు భౌతిక దూరం నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌ ఉండాలి. అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారి ముందుగానే సమయం కేటాయించాలి. నామినేషన్‌ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లే అభ్యర్థి వెంట ఇద్దరు వ్యక్తులు, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. అభ్యర్థులు నామినేషన్లు ఆన్‌లైన్‌లోనే సమర్పించి ఆ తర్వాత ప్రింట్‌ కాపీని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల‌ని సూచించింది ఈసీ. నామినేషన్‌ సమయంలో డిపాజిట్‌ చేయాల్సిన మొత్తాన్ని ఆన్‌లైన్ ‌ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రచారంలో కఠిన నిబంధనలు..

ఎన్నికల ప్రచారంలోనూ నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. కొవిడ్‌–19 మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి ముందుగా అనుమతించిన చోటే బహిరంగ సభలు జరపాల్సి ఉంటుంది. సభలకు హాజరయ్యే వారు భౌతిక దూరం వంటివి పాటించేలా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఎన్నికల సభలకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ పేర్కొన్న పరిమితికి లోబడి ఉండేలా చూడటం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్‌పీ బాధ్యత. ఇక ఇంటింటి ప్రచారం సమయంలో భద్రతా సిబ్బంది మినహాయించి అభ్యర్థి సహా ఐదుగురే పాల్గొనాలి. రోడ్‌షోల్లో పాల్గొనే వాహన కాన్వాయ్‌లో భద్రతా సిబ్బందిని మినహాయిస్తే ఐదు వాహనాలే ఉండాలి.

వారికి చివరి గంటలో అవకాశం..

ఎన్నికలకు కనీసం ఒక రోజు ముందు పోలింగ్‌ స్టేషన్లను తప్పనిసరిగా పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయాలి. అన్ని పోలింగ్‌ స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సిబ్బంది కానీ పారామెడికల్‌ సిబ్బంది కానీ పోలింగ్‌ స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఓటర్లకు థర్మల్‌ స్కానింగ్‌ చేపట్టాలి. ఓటర్లందరికీ శరీర ఉష్ణోగ్రతలు గమనించాలి. అనుమానాస్పదంగా ఉంటే రెండు పర్యాయాలు ఉష్ణోగ్రతలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ జారీ చేసిన సురక్షిత స్థాయికి మించి కనిపిస్తే వారికి పోలింగ్‌ ముగిసే చివరి గంటలో ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. అలాగే కోవిడ్‌–19 సోకి క్వారంటైన్‌లో గడుపుతున్న వారికి కూడా పోలింగ్‌ ముగిసే ఆఖరి గంటలో అవకాశం కల్పిస్తారు. గత నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలను ప్రెస్ చేసి ఓటు వేసేందుకు ఓటర్లందరికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద చేతి గ్లౌజులు ఇవ్వాల‌ని.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతివ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించాల‌ని పేర్కొంది. పోలింగ్‌ స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న 1,500 మంది ఓటర్లకు బదులు.. వెయ్యి మందికి మించి ఉండకూడదు.

పర్యవేక్షణ

ఎన్నికల ప్రక్రియ సమయంలో కొవిడ్‌–19 సంబంధిత ఏర్పాట్లు, నివారణ చర్యలు వంటివి పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్‌ అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారుల శిక్షణ కూడా ఆన్‌లైన్‌లోనే జరిపే అవకాశం ఉంది. ఎన్నికల సిబ్బందిలో కొవిడ్‌–19 లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి బదులుగా మరొకరిని నియమించే ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారులు చూసుకుంటారు. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాల్లో శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి. భౌతికదూరం పాటించేందుకు వీలుగా గుర్తులు ఏర్పాటు చేయాల‌న్న ఎన్నికల సంఘం.. బీఎల్‌వోలు, వాలంటీర్లు భౌతికదూరం నిబంధనలు సరిగా అమలయ్యేలా చూడాల‌ని ఆదేశించింది.

ఓట్ల లెక్కింపులో..

పోలింగ్‌ ముగిసిన అనంతరం... ఓట్ల లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శానిటైజ్‌ చేయనున్నారు. ఓట్లు లెక్కించేటప్పుడు ఒక హాల్‌లో ఏడు టేబుళ్ల కంటే ఎక్కువ అనుమతించరు. ప్రతి నియోజకవర్గంలో మూడు నాలుగు హాళ్లు ఏర్పాటు చేసి అదనపు సహాయ రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు చేప‌ట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాలను కూడా ఓట్ల‌ లెక్కింపునకు ముందు, తర్వాత శానిటైజ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మొత్తంగా ఈసీ చేస్తున్న కసరత్తు విజయవంతం కావాలంటే.. రాజకీయ పార్టీలు సైతం క్రియాశీలకంగా తోడ్పాటునందించాల్సి ఉంటుంది.

ఇలా నామినేషన్ల ఘట్టం మొదలు.. ప్రచారపర్వం, రోడ్‌షోలు, ర్యాలీల సందర్భంగా ఆచరించాల్సిన స్పష్టమైన విధివిధానాలు, బహిరంగ సభా ప్రాంగణాల్లోనూ కచ్చితంగా పాటించాల్సిన భౌతిక దూరం నిబంధనల్ని ఈసీ క్రోడీకరించింది. ఓటర్లందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అన్నిరకాల చర్యలు తీసుకుంటూనే కరోనాను నియంత్రించేలా నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు కొత్త నియమావళిలో కొలువుతీరాయి.

ఇదీ చూడండి: కరోనా సంక్షోభం మధ్య ఎన్నికలకు బిహార్​ సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details