ఓటర్ల జాబితా విషయంలో గందరగోళం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్నది కూడా ఒక్కటే జాబితా అని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. ప్రస్తుత జాబితాలో సాంకేతిక తేడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వార్డులను పెంచుకోవాలంటే రాష్ట్రాల ఎన్నికల కమిషన్ చట్టాలను సవరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
రాజ్యాంగ సవరణ చేయాల్సింది నియోజకవర్గాల పునర్విభజన కోసం మాత్రమేనని అన్నారు రావత్. 2031లోగా పునర్విభజన సాధ్యమవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తే అవినీతి ఉండదనేది అర్థం లేని వాదన అని అన్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్‌తో కూడుకున్నట్లు చెప్పారు. ఒకే దేశం...ఒకే ఓటరు జాబితాపై ఆయన 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఒకే దేశం... ఒకే ఓటరు జాబితా... ఆచరణాత్మకమేనా?
ప్రస్తుతం ఉన్నది ఒకటే ఓటరు జాబితా. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేయిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఆ జాబితాను వినియోగించుకుంటాయి. వారు కొత్తగా ఇంటింటికి వెళ్లి జాబితాలను తయారు చేయరు. ఎక్కడో సమాచార లోపం ఉన్నట్లుంది. రాజ్యాంగ సవరణ దాకా వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటున్నాను.
స్థానిక సంస్థల ఎన్నికలు వార్డుల కేంద్రంగా జరుగుతాయి కదా? అప్పుడైనా జాబితా తయారు చేయాల్సిందే కదా?
అవును చేయాలి. పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికలను వార్డుల వారీగా నిర్వహించలేం కదా? గతంలో వార్డుల వారీగా విభజించటం సమస్యగా ఉండేది.ప్రస్తుతం సాంకేతిక సహకారంతో ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. కొందరు దేశాన్ని గందరగోళంలోకి నెడుతున్నారు.
రాజ్యాంగ సవరణ కూడా చేయాలంటున్నారు కదా?
ఆ వాదనలో అర్థం లేదు. రాజ్యాంగ సవరణ చేయాల్సింది నియోజకవర్గాల పునర్విభజన కోసమే. స్థానిక సంస్థల్లో జనాభా పెరిగితే వార్డులు పెంచుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘంలోని నిబంధనలు మార్చుకోవాలి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదు. అందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణపై గడిచిన కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోవడంతోనే ఈ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ డిమాండు అంతగా లేదు.
ఎన్నికల సంఘం ముందున్న సవాళ్లు ఏమిటి?