ఒడిశాలో బ్యాంకు అధికారుల నిర్వాకం వల్ల.. 120ఏళ్ల బామ్మ పెన్షన్ తీసుకోవడానికి అష్టకష్టాలు పడింది. పెన్షన్ డబ్బును ఉపసంహరించుకోవాలంటే.. బామ్మ కచ్చితంగా బ్యాంకుకు వచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టారు బ్యాంకు అధికారులు. అందుకే నడవలేని స్థితిలోనూ మంచంమీదే పడుకుని కూతురు సాయంతో బ్యాంకు వద్దకు చేరుకుంది ఆ బామ్మ. నౌపాడా జిల్లా ఖారియర్ మండలం బరాగాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరి మనసులను కలచివేస్తోంది.
ఇదీ జరిగింది
తన పెన్షన్ ఖాతా నుంచి రూ. 1,500 లను తీసుకొని రమ్మని 70ఏళ్ల తన కూతురు గూంజా డీని పంపింది బామ్మ. కానీ అది పెన్షన్ ఖాతా అయినందున నిబంధనల ప్రకారం సదరు ఖాతాదారే వచ్చి నగదు ఉపసంహరించుకోవాలని అధికారులు పట్టుబట్టారు. నిస్సహాయురాలైన గుంజా డీ.. చేసేదేమీ లేక తన తల్లిని మంచం మీద పడుకోబెట్టుకొని బ్యాంకు వరకు మంచాన్ని లాక్కొని పోయింది. బామ్మను చూసిన అనంతరం అధికారులు ఆమె పెన్షన్ డబ్బులు ఇచ్చారు.
ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవటం వల్ల ఆ ప్రాంత ఎమ్మెల్యే అధిరాజ్ పానిగ్రాహి ఘాటుగా స్పందించారు. ఈ చర్యపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.