తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐన్​స్టీన్, నెహ్రూ స్థాయి గౌరవం ఆమెకు దక్కింది - The American Academy of Arts and Science

ప్రఖ్యాత 'ది అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌'లో సభ్యత్వం సాధించారు భారత మహిళా శాస్త్రవేత్త శోభనా నరసింహన్​. బెంగళూరులో థియరెటికల్‌ సైన్సెస్‌ పాఠాలు చెబుతోన్న ప్రొఫెసర్‌తో మాట కలిపింది వసుంధర. ఈ సందర్భంగా మహిళా సాధికారతతో సహా కరోనాపై పోరులో అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం గురించి ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Einstein ... Nehru ... Shobhana Narasimhan
ఐన్​స్టీన్...​ నెహ్రూ... ఆమె

By

Published : May 11, 2020, 10:13 AM IST

ది అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌... ప్రపంచ నేతలు, నోబెల్‌ గ్రహీతలతో కూడిన ప్రఖ్యాత సంస్థ. అలాంటి ప్రఖ్యాత సంస్థలో సభ్యత్వం దక్కడం గొప్ప విషయం. అలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్నారు మన మహిళా శాస్త్రవేత్త శోభనా నరసింహన్‌. బెంగళూరులో థియరెటికల్‌ సైన్సెస్‌ పాఠాలు చెబుతోన్న ప్రొఫెసర్‌తో మాట కలిపింది వసుంధర.

కరోనాపై కలిసికట్టుగా...

వైరాలజిస్టలు, బయాలజిస్టులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు.. అందరూ కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన మహమ్మారి కరోనా. దీన్ని కట్టడి చేయడంలో మా మెటీరియల్‌ సైంటిస్టులకు సైతం మంచి పాత్ర పోషించే అవకాశం ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్‌ అణువులను సైతం వడగట్టేలా మాస్కులు, భద్రతా పరికరాలు తయారు చేసి కొవిడ్‌ను ఎదుర్కోవచ్చు.

నాన్న అడుగుజాడల్లో...

నాన్న ఎం.ఎస్‌.నరసింహన్‌ ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, రాయల్‌ సొసైటీ ఫెలో. అమ్మ శకుంతల పాత్రికేయురాలు. వాళ్ల ప్రభావం నాపై ఉంది. ఐఐటీ-బొంబాయి నుంచి ఎమ్మెస్సీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాను. తర్వాత అమెరికా, జర్మనీల్లో పోస్ట్‌డాక్టోరల్‌ పరిశోధన చేసి 1996లో భారత్‌ తిరిగొచ్ఛా అప్పట్నుంచి బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌లో బోధకురాలిగా ఉన్నాను.

అదే ప్రేరణ...

ఇంటర్లోనే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మీద ఒక రేడియో కార్యక్రమం రూపొందించాను. నాన్న ఉద్యోగరీత్యా మా కుటుంబం ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ ప్రాంగణంలో ఉండేవాళ్లం. అక్కడ దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా సైన్స్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే వెళ్లి సరదాగా వినేదాన్ని. నా పదహారో పుట్టినరోజుకి నాన్న ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అది చదివాక శాస్త్రవేత్త కావాలని నిశ్చయించుకున్నాను.

అడ్డంకులు దాటి...

శాస్త్రవేత్తగా మారాక ఈ రంగంలో మగాళ్ల ఆధిపత్యం ఎక్కువని గ్రహించాను. నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. అవకాశాలు కల్పించుకొని మరీ పలు పరిశోధనల్లో పాలుపంచుకునేదాన్ని. పరిశోధన, బోధన.. ఎందులో ఉన్నా మహిళలకు మార్గదర్శిలా నిలవాలనుకున్నా. ఆ కష్టం ఊరికే పోలేదు. మంచి గుర్తింపు దక్కింది. పదవులెన్నో వరించాయి. కంప్యూటేషనల్‌ నానోసైన్స్‌లో విభాగంలో పలు ప్రయోగాలు చేశాను. అతి సూక్ష్మ పరమాణువుల్లోని అయస్కాంతత్వంతో మెరుగైన ఫలితాలు రాబట్టడంపై పరిశోధనలు చేపట్టాను. ఇప్పుడు బోధన ఆస్వాదిస్తున్నా.

అమెరికన్ అకాడెమీలో...

ది అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (ఏఏఏఏస్‌) ప్రపంచంలోని ప్రతి శాస్త్రవేత్త, కళాకారుడు, రచయిత, మానవతావాది, వ్యాపారవేత్త.. సభ్యత్వం కోసం కలలు కనే సంస్థ. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్‌ వాషింగ్టన్‌, థామస్‌ జఫెర్సన్‌లు దీని సహ వ్యవస్థాపకులు. వేర్వేరు రంగాలకు చెందిన ప్రపంచంలోని గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, నిపుణులను ఒక్కతాటిపైకి తీసుకురావడం దీని ఉద్దేశం. మానవాళికి, ప్రపంచానికి మేలు కలిగేలా ఆవిష్కరణలు చేయడం లక్ష్యం. చార్లెస్‌ డార్విన్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు.. జాన్‌ ఎఫ్‌.కెన్నడీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, నెల్సన్‌ మండేలా, జవహర్‌లాల్‌ నెహ్రూలాంటి గొప్ప నేతలతోపాటు 250మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ సభ్యత్వం దక్కడం గొప్ప విషయం. ముందు ఎవరైనా ఒక రంగంలోని నిపుణుడు నామినేట్‌ చేయాలి. సంస్థలోని సగానికిపైగా సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. అప్పుడే ఎంపిక. అమెరికా బయటి దేశానికి చెందిన వారినైతే ‘ఇంటర్నేషనల్‌ హానరరీ మెంబర్‌’గా గుర్తిస్తారు.

ప్రాతినిధ్యం పెరగాలి...

భారత్‌లో పరిశోధనారంగంలో మహిళలు తక్కువ. దేశంలోని మొత్తం వర్కింగ్‌ సైంటిస్టుల్లో వారి వాటా 14శాతమే. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోల్చినా ఇది తక్కువే. కుటుంబ ఒత్తిళ్లు, వివాహం, పిల్లలు.. కారణాలేమైనా మహిళలు పరిశోధనలు కొనసాగించలేకపోతున్నారు. కొన్నిచోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి కేంద్రం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ‘విమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌’ తీసుకొచ్చాయి. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మనుషుల ఆలోచనల్లో మార్పు రాకపోతే ఎవరేం చేయలేరు.

ఇదీ చూడండి:ఎయిమ్స్ వైద్యుడి సాహసం- పీపీఈ తొలగించి చికిత్స

ABOUT THE AUTHOR

...view details