తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు - రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచితంగా ప్రవర్తించారంటూ 8 మంది ఎంపీలపై వారం రోజుల పాటు సస్పెషన్ వేటు వేశారు.

Eight-members-of-the-House-are-suspended-for-a-week-in-Rajya-Sabha
పెద్దలసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

By

Published : Sep 21, 2020, 11:59 AM IST

వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 మంది విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. బిల్లుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌‌ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును వెంకయ్య తోసిపుచ్చారు. సభా నియమాల ప్రకారం డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం ఆమోదనీయం కాదన్నారు.

చీకటి రోజు..

బిల్లుల చర్చ, ఓటింగ్‌ సమయంలో నిన్న విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును ఛైర్మన్‌ తీవ్రంగా ఆక్షేపించారు. రాజ్యసభ చరిత్రలో ఓ చీకటి దినంగా మిగిలిపోతుందన్నారు. భౌతికంగా ఇబ్బంది పెట్టడం, డిప్యూటీ ఛైర్మన్‌ను తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుపడ్డారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ అనూహ్య పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఘటనను తీవ్రంగా ఖండించారు. నిరసనలకు కారణమైన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

ఫిర్యాదు మేరకు..

నిన్న అనుచితంగా ప్రవర్తించిన విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్న అధికార భాజపా ఫిర్యాదు మేరకు నిబంధనల ప్రకారం ఛైర్మన్‌ వారిపై వేటు వేశారు. సభ నుంచి 8 మంది సభ్యులను వారం పాటు సస్పెండ్‌ చేశారు. ఎంపీలు డెరెక్‌ ఒబ్రెయన్‌, సంజయ్‌ సింగ్‌, రాజుసత్వ, రిపున్‌బోర, డోలాసేన్‌, కె.కె.రాగేశ్‌, నాజిర్‌ హుస్సేన్‌, ఎలమరిన్‌ కరీంపై చర్యలు తీసుకున్నారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినా, వారు నిరాకరించడం వల్ల సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సస్పెండైన ఎంపీలు సభను వీడకపోవడం వల్ల డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సభను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details