ఛత్తీస్‌గఢ్ ప్రమాదంలో 8 మంది మృతి ఛత్తీస్‌గఢ్ కొండగావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు. రాయ్‌పుర్-జగ్దల్పుర్ జాతీయ రహదారిపై దుధ్గావ్ గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
జగ్దల్పుర్ వైపు వెళ్తోన్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కొండగావ్ జిల్లా పాలనాధికారి. మృతుల కుటుంబాలకు రూ.25 వేల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.