'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్‌స్టార్ రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ భాజపాకు సానుకూలంగా ఉంటున్నారని.. 2021లో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు భాజపాలో చేరుతారంటూ వస్తోన్న ఊహాగానాలను ఖండించారు.
తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ.. పలు విషయాలపై మాట్లాడారు. తాను భాజపాకు చెందిన వ్యక్తి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. వివాదాస్పద తిరువల్లూరు విగ్రహ ఘటనలో తనపై కాషాయ రంగు పులుమాలని కొందరు ప్రయత్నించినట్లు ఆరోపించారు.
"ఇది కొందరు వ్యక్తులు కావాలని పులిమిన రంగు. నన్ను ఓ భాజపా వ్యక్తిగా చిత్రీకరించాలనుకున్నారు. వాళ్ల ఉచ్చులో నేను పడను. ఇది పూర్తిగా అవాస్తవం. "
-రజనీకాంత్, సినీ నటుడు
ఇటీవల రాష్ట్ర భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో భేటీపైనా స్పందించారు. ఆయన తనను భాజపాలోకి రావాలని ఆహ్వానించలేదన్నారు. అయోధ్య తీర్పు రానున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని, కోర్టు తీర్పులను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రజనీ. తమిళనాట నాయకత్వ శూన్యత ఉందని, తాను రాజకీయ పార్టీ ప్రారంభించేంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు.
రజనీకి భాజపా సమర్థన
రజనీకాంత్ వ్యాఖ్యలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావ్ సమర్థించారు.
"భాజపాలో రజనీని చేరమనీ కానీ... చేరతారా అని కానీ మేం అడగలేదు. ఈ ఊహాగానాలతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. మా దృష్టంతా ఇక్కడ స్థానిక ఎన్నికలపైనే కేంద్రీకరించాం."
-మురళీధర్ రావ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి