భారత్‌తో సైనికబంధం మరింత బలోపేతమయ్యేలా చొరవ చూపుతూ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ‘టైగర్ ట్రయంప్’ను ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఎనలేని ఆసక్తిని రేపింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఇరుదేశాల త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలపై ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా నిర్వహించనున్న సంయుక్త సైనిక విన్యాసాలతో భారత్, అమెరికా సంబంధాల్లో సరికొత్త బంధానికి తెరలేచింది. భారత - అమెరికా నౌకాదళాలు 1992 నుంచీ ‘మలబార్’ పేరిట సంయుక్త విన్యాసాలు చేపడుతున్నాయి. ఇరు నౌకాదళాల అధికారుల మధ్య పరస్పర అవగాహన ఉంటే భవిష్యత్తులో ఏవైనా ప్రత్యేక ఆపరేషన్లను లోపాలకు తావు లేకుండా నిర్వహించవచ్చనేది సంయుక్త సైనిక విన్యాసాల అంతిమ లక్ష్యం. ఈ ఆపరేషన్లకు సన్నద్ధమయ్యేందుకు కొన్ని ప్రత్యేక కారణాలూ లేకపోలేదు. భారత్‌కు మూడువైపులా ఉండే హిందూ, అరేబియా మహాసముద్రాలు; బంగాళాఖాతంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా శత్రువులపై విరుచుకుపడే తిరుగులేని శక్తిసామర్థ్యాలు దేశ నౌకాదళానికి ఉన్నాయి. ప్రపంచంపై పట్టు సాధించే దిశగా నిరంతరం యత్నించే అమెరికా నౌకాదళానికి- భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలేమిటో తెలుసు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలపై అమెరికా నౌకాదళానికి విశేషమైన పట్టుంది. అక్కడి సముద్ర వాతావరణానికి సంబంధించిన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. వాటితోనే అమెరికా నౌకాదళం అన్నిచోట్లా పోరాడాలనుకుంటే ముప్పు తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే- భారత నౌకాదళంతో జట్టు కట్టేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. గత 27 ఏళ్లలో వేలమంది అధికారులు, సిబ్బంది సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు చేశారు. ఇరు నౌకాదళాల్లోని జలాంతర్గాములు, విమాన వాహక యుద్ధనౌకలు, విభిన్న రకాల యుద్ధనౌకలు తదితర అన్ని విభాగాల సిబ్బంది పరస్పరం సహకరించుకుని- పలు సైనిక వ్యూహాలను ఉమ్మడిగా అమలు చేయగల నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. సైనిక పరమైన అంశాలే కాకుండా సముద్ర కాలుష్యం, విపత్తుల్లో సహాయక, పునరావాస చర్యలు, సముద్ర దొంగలపై దాడులు, చట్టాల అమలు తదితర అంశాలపైనా ఉమ్మడిగా విధులు నిర్వర్తించి బాధితులకు అత్యంత వేగంగా సేవలు అందించగల స్థాయికి చేరుకున్నారు.
జపాన్ సైతం
భారత్, అమెరికా నౌకాదళాలు ‘మలబార్’ పేరిట చేస్తున్న రక్షణ విన్యాసాల పరమార్థం తెలిసిన జపాన్ సైతం భాగస్వామిగా మారింది. తన తీరాన్ని కాపాడుకునేందుకు పెద్ద దేశాల అండ తప్పనిసరని ఆ దేశం గుర్తించింది. 2007లోనే మలబార్ విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చిన జపాన్, ఆ తరవాత 2015లో భాగస్వామిగా మారింది. ఆస్ట్రేలియా సైతం వీటిపై ఆసక్తి చూపి, విన్యాసాల్లో పాల్గొంది. భారత్, ఆమెరికా నౌకాదళాల సంయుక్త భాగస్వామ్యం తమ నౌకాదళానికి అదనపు అండగా ఉంటుందని ఆ దేశం భావిస్తోంది. మలబార్ విన్యాసాల ఫలితంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల మధ్య నౌకాదళ బంధం మరింత దృఢంగా మారింది. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాల రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అమెరికా సైన్యంలో ప్రత్యేకంగా ‘ఇండో పసిఫిక్ కమాండ్’ ఏర్పాటైంది. అది బలంగా ఉండాలంటే సమీపంలోని సానుకూల దేశాలన్నీ రక్షణపరంగా పటిష్ఠంగా ఉండాలని అగ్రరాజ్యం కోరుకుంటోంది. అందుకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాలను సన్నిహిత నౌకాదళాలకు బదిలీ చేసేందుకూ సంకోచించడం లేదు. అందులో భాగంగానే బహుళ ప్రయోజనకర యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’ను, అత్యంత అధునాతనమైన నిఘా యుద్ధ విమానం ‘పి8ఐ’ని మన దేశానికి విక్రయించింది.